calender_icon.png 24 September, 2024 | 6:01 AM

బీఆర్‌ఎస్ నేతల ఫోన్లు ట్యాపింగ్

06-09-2024 12:57:02 AM

  1. అధికారుల ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది 
  2. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచనల వ్యాఖ్యలు

హుజూరాబాద్, సెప్టెంబరు 5 : బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీల ఫోన్లతోపాటు జిల్లా పోలీస్ అధికారుల ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే తమ వ్యక్తిగత సమాచారం ప్రభుత్వానికి ఎలా చేరుతుందో చెప్పాలని డిమాండ్‌చేశారు. తాము ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. మానకొండూర్ ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఒక ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారని, ఆ ఇంటర్వ్యూలో కరీంనగర్ సీపీ నుంచి మానకొండూర్ సీఐకి వీడియో కాన్ఫరెన్సు రావడం లేదని ఎలా చెప్పారని ప్రశ్నించారు.

సీపీ టెలికాన్ఫరెన్స్ గోప్యంగా ఉంటుందని, అయినప్పటికీ మానకొండూర్ ఎమ్మెల్యేకు ఆ విషయం తెలిసిందంటే కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేశారనే అర్థమవుతుందని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ సీపీ ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ ఎంక్వైయిరీకి ఆదేశించాలని కోరారు. దీనిపై పూర్తి విచారణ జరిపించడానికి ముందుండాలని అన్నారు. రుణమాఫీ కోసం రైతులు రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల రుణమాఫీ మొత్తం కావాలంటే రూ.49 వేల కోట్లు అవసరం ఉంటుందని బ్యాంకర్లు చెప్పినప్పటికీ, 40 వేల కోట్లు సరిపోతాయని చెప్పారని గుర్తుచేశారు.

తర్వాత మాట మార్చి రూ.31వేల కోట్లు అని చెప్పి, బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు చూపించి, చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, అవి కూడా పూర్తిస్థాయిలో చేశారో లేదో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడంలో ఉన్న శ్రద్ధ రుణమాఫీ చేయడంలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.