l బీఆర్‌ఎస్ నేతలవి పిల్లిశాపనార్థాలు
l రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రాజన్న సిరిసిల్ల/కరీంనగర్ ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే నుంచే సర్కార్ కూలుతుందని బీఆర్‌ఎస్ నేతలు పిల్లిశాపనార్థాలు పెట్టారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పార్టీ, లిక్కర్ స్కాం పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ నేతలకు దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ ఎప్పుడూ ఎవరినీ కలవరని, ప్రజాసమస్యలను పట్టించు కోరని విమర్శించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎంపీగా ఉండి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో, ప్రసాద్ పథకంలో భాగంగా జిల్లాలో ఏయే గుడులను అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీల్లో ఒక్క హామీనైనా నెరవేర్చలేదన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేస్తే బీజేపీ నేతలు ఆపలేకపోయారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వానాకాలంలో రైతులు పండించిన ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
--రైతు సమస్యల పట్ల బీఆర్‌ఎస్, బీజేపీ మొసలి కన్నీరు
రైతు సమస్యల పట్ల బీఆర్‌ఎస్, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. శుక్రవారం ఉదయం ఆయన మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి కరీంనగర్‌లోని బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.
కేంద్రంలో బీజేపీ నియంతృత్వ పాలన పోవాలని, కాంగ్రెస్ పాలన రావాలన్నారు. వివిధ సంస్థల నుంచి నల్లధనాన్ని తీసుకోవడానికి ఎలక్ట్రోరల్ బాండ్లు రూపొందించామని సాక్షాత్తు ప్రధాని మోదీ చెప్పడం అవినీతిని ప్రోత్సమించడమేనన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ రాజకీయాలకు సంబంధం లేని తల్లుల గురించి ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్‌కు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు విడదీయలేని అనుబంధం ఉందని ఆరోపించారు. ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉన్నవారు, ఇప్పుడు పాలు నీళ్లలా ఎలా కలిసిపోయారో ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు.