- ఓ సంస్థ వద్ద డాటా కొనుగోలు చేసిన ముఠా
- ఫోన్లు చేసి బీమా, రుణాలు ఇస్తామంటూ మోసం
నోయిడా, జూలై 7: డాటా.. ప్రస్తుత ఆన్‌లైన్ ప్రపంచంలో వ్యక్తిగతంగా ఎంతో విలు వైంది. బిగ్ డాటా అనలటిక్స్ సాయంతో ఎన్నో కంపెనీలు వినియోగదారుల వ్యక్తిగత వివరాలను పొంది తమకు అనువైన కస్టమర్లపై దృష్టి సారించేందుకు ఉపయోగించుకుం టున్నాయి. కొందరు అవకాశవాదులు చౌకగా డాటాను అమ్మేస్తున్నారు. ఇలాంటి కుంభకోణమే తాజాగా నోయిడాలో బయటపడింది. కేవలం రూ.2,500లతో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఫోన్ డాటాతో ఓ కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. నకిలీ బీమా పాలసీలు, రుణాల పేరుతో ప్రజలను మోసగించి వేల కోట్లు స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొమ్మిది మహిళలు సహా 11 మందిని అరెస్టు చేశారు.
మోసాన్ని బట్టి ఆదాయం
ఇద్దరు మాజీ పాలసీ ఏజెంట్లు నోయిడాలోని సెక్టార్ 51లోని ఓ భవనంలో కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. దీన్ని ఓ సంవత్సరం పాటు నిర్వహించారు. రుణాలు, జీవిత బీమా పాలసీలపై అధిక రాబడిని ఆశ చూపి దేశంలోని చాలా మందిని మోసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారులుగా అశిష్, జితేంద్రను గుర్తించారు. వీరు 9 మంది మహిళలను కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించుకు న్నారు. వారికి నకిలీ ఆధార్ కార్డుల ద్వారా సిమ్ కార్డులను కొనుగోలు చేసి అందజేశారు. ఈ ముఠా కొనుగోలు చేసిన వివిధ వ్యక్తుల డాటాను అనుసరించి వాళ్లకు ఫోన్లు చేసి కాల్‌సెంటర్‌లో మహిళలు పాలసీలను విక్రయి స్తారు. తమ వలలో చిక్కే బాధితులను గుర్తించి ఈ ఫేక్ సిమ్ కార్డుల ద్వారా ఫోన్లు చేస్తారు. ఎంతమందికి పాలసీలు విక్రయిస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పేవారని తెలుస్తోంది.
బ్లాక్ డైరీలో వివరాలు
కర్ణాటకకు చెందిన అరవింద్ అనే వ్యక్తి నుంచి నెలకు రూ.1,000 పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా ప్రతి నెలా ఈ ఫ్రాడ్ వ్యక్తులకు డబ్బు వస్తోంది. అశిష్, జితేంద్ర నోయిడాలో డబ్బును తీసుకునేందుకు డెబిట్ కార్డులను ఉపయోగిస్తారు. అయితే, అనుమానంతో పోలీసులు దాడి చేయగా అశిష్ ఉపయోగించిన బ్లాక్ డైరీ దొరికింది. ఏడాది కాలంగా వారు ఈ కుంభకోణంలో సంపాదించిన కోట్లాది రూపాయలకు చెందిన ప్రతి ఆర్థిక లావాదేవీని అందులో రాసుకున్నారు. క్రైం రెస్పాన్స్ టీం (సీఆర్‌టీ), స్థానిక సెక్టార్ 49 పోలీసులు నిర్వహించిన ఈ సంయుక్త ఆపరేషన్‌లో ఈ వివరాలన్నీ బయటపడినట్లు డీసీపీ శక్తిమోహన్ అవస్థీ తెలిపారు.
10 వేల మంది డాటాతో
అశిష్, జితేంద్ర 2019లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేశారు. అందులో లొసుగులను గమనించి ఈ స్కాంకు పథకం వేశారు. వారు ఇండియా మార్ట్ నుంచి రూ.2,500కు 10 వేల మంది వ్యక్తుల డాటాను కొనుగోలు చేసి స్కాంకు తెరతీశారు.