12-02-2025 05:26:09 PM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ బుదవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్య మిషన్ సిబ్బంది, సమయపాలనపై ఆరాతీశారు. వైద్యులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సమయపాలన పాటించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని గదులను శుభ్రంగా ఉంచాలని వైద్యాధికారి గదిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్యుల, వైద్య సిబ్బంది వివరములు, ఆరోగ్య కేంద్రం మ్యాపు ఉంచాలని ఆదేశించారు.
స్త్రీ పురుషుల వార్డులు వేరువేరుగా ఉంచాలని వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఉపయోగించే వ్యాక్సిన్ క్యారియర్లను సరిగా ఉంచుకోవాలని పాడైన వస్తువులను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నిర్ణయించి తీసివేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ కోసము తయారు చేయాలని, అంతే కాకుండా ఆరోగ్య కేంద్రంలో స్థలం ఉన్నందున పచ్చదనం పరిశుభ్రత ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న క్వార్టర్లను వారం రోజుల్లో శుభ్రం చేయించాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న సేవలు పైన వివరములు రోజు వారిగా అందజేయాలని, అన్ని కార్యక్రమాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, నిరుపయోగంగా ఉన్న ఆపరేషన్ థియేటర్ ను సందర్శించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చి ఆపరేషన్ థియేటర్ ను సిద్ధం చేయాలని స్టాఫ్ నర్స్ లు ఉన్నందున డెలివరీలు చేయాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో పిహెచ్సిలో శుభ్రత చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేసుకోని వైద్య సిబ్బందిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేష్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వెంకట సాయి, స్టాప్ నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.