- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- వామపక్షాలతో కలిసి లగచర్లలో పర్యటన
వికారాబాద్, నవంబర్ 21(విజయక్రాంతి): ఫార్మా కంపెనీల ఏర్పాటు నిర్ణయా న్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో లగచర్ల గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు.
ఫార్మా బాధిత గ్రామాల్లో వెంటనే పోలీసు పికెటింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులు భూములు ఇవ్వమని కరాఖండిగా చెబుతున్నప్పటికీ బలవంతపు భూసేకరణ చేపడుతున్నారనే కోపంతోనే వారు అధికారులపై తిరగబడ్డారని.. అయితే ఇలాంటి దాడులు సరైనవి కావని అన్నారు.
అయితే రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకుంటామంటే సహించేది లేదన్నారు. రైతు కంట కన్నీరు తెప్పించిన ఏ నాయకుడూ రాణించలేదని స్పష్టం చేశారు. ప్రజల తరుపున వామపక్ష పార్టీలు పోరాడుతాయన్నారు. ఆయన వెంట సీపీఎం నాయకులు ఉన్నారు.