calender_icon.png 22 September, 2024 | 9:06 PM

ఫార్మాసిటీ రద్దు కాలేదు

22-09-2024 02:24:07 AM

యథావిధిగా కొనసాగుతుంది

రద్దుకు విధాన నిర్ణయం తీసుకోలేదు

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ రద్దు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం శనివారం హైకోర్టుకు తెలిపింది. 2016లో జారీచేసిన జీవో 31 ప్రకారం ఇది యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాని రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీ కాలేదని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములపై ఆంక్షలు తొలగించి, ధరణి పోర్టల్లో లావాదేవీలు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన డీవీవీ సత్య కొండలరాయ చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు వివరాలివ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించటంతో ఆయన అఫిడవిట్ సమర్పించారు. 

అన్నీ చట్టప్రకారమే..

మేడిపల్లిలో ఫార్మాసిటీ కోసం సేకరించిన 1700 ఎకరాల భూమిలో పిటిషనర్‌కు సర్వే నం.124లో 10 ఎకరాల భూమి ఉందని అఫిడవిట్‌లో తెలిపారు. ‘మేడిపల్లిలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి 1700 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం భూసేకరణ చట్టం సెక్షన్ 11(1) కింద ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు ముందు ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం 2016లో జీవో 31 జారీ చేసింది. భూసేకరణ చట్టం కింద కొన్ని మినహాయింపులనిస్తూ ప్రభుత్వం జీవో 46 జారీ చేసింది.

డిక్లరేషన్, పరిహారం అవార్డు నిబంధనల ప్రకారం జరగలేదన్న ఆరోపణలు అవాస్తవం. చట్ట ప్రకారమే భూసేకరణ చేపట్టాం. డిక్లరేషన్ అవార్డుపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు అభ్యంతరాల స్వీకరణ నుంచి భూసేకరణ ప్రక్రియను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ అమల్లోనే ఉంది. భూసేకరణ ప్రక్రియ అమల్లో ఉన్నప్పుడు భూమిపై ధరణి పోర్టల్ ద్వారా ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేరు. భూసేకరణ ప్రక్రియలో ఉన్నందున ధరణిలో ఎంట్రీల నిమిత్తం పిటిషనర్ పెట్టిన దరఖాస్తును అనుమతిం చలేము.

అంతేగాక అవార్డు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీళ్లు దాఖలు చేశాం. ఇవి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయి. భూసేకరణ నిమిత్తం రెండు పత్రికల్లో నోటిఫికేషన్ ప్రచురించాం. గ్రామసభ నిర్వహించి నోటీసులు జారీ చేయడంతోపాటు అందరికీ ఫార్మాసిటీ ప్రాముఖ్యతను వివరించాం. మొదట పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలుగా నిర్ణయించినా తరువాత రూ.16 లక్షలకు పెంచాం. దీనికి అదనంగా 121 చదరపు గజాల ఇంటిజాగను కేటాయిస్తున్నాం. పిటిషనర్ అవార్డు నోటిఫికేష్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.

నోటీసులకు సమాధానం ఇవ్వనందున అధికారులు జారీచేసిన పరిహారం అవార్డు మొత్తాన్ని భూసేకరణ అథారిటీ వద్ద డిపాజిట్ చేశాం. ఫార్మాసిటీని రద్దు చేస్తూ విధాన నిర్ణయం తీసుకున్నారని, అందువల్ల భూసేకరణ కొనసాగించడానికి వీల్లేదన్న వాదన అవాస్తవం. ప్రస్తుతం భూసేకరణ నోటిఫికేషన్ అమల్లో ఉన్నందున ధరణిలో లావాదేవీలకు అనుమతించాలన్న పిటిషన్‌ను కొట్టివేయండి’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో కోరింది.

ఎన్ని వాయిదాలు తీసుకుంటారు?: హైకోర్టు

యాచారం మండలం మేడిపల్లిలో సేకరించిన భూముల్లో ఫార్మా సిటీ కొనసాగిస్తారా? లేదా? అని చెప్పడానికి ఎన్ని వాయిదాలు తీసుకుంటా రని ప్రభుత్వాన్ని శనివారం హైకోర్టు ప్రశ్నించింది. ఫార్మా సిటీ రద్దయినట్లు పత్రికల్లో కథనాలను పిటిషనర్లు సమర్పించగా ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. వీటిపై సోమవారానికల్లా స్పష్టతనివ్వాలని, అన్ని పిటిషన్లపై ఆరోజు విచారణ చేపడతామని తెలిపింది. ఫార్మాసిటీ భూము లపై ధరణిలో లావాదేవీలకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శనివారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు.

ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇందులో కౌంట ర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నిసార్లు వాయిదాలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఫార్మా సిటీ కొనసాగిస్తున్నారా? లేదా? అన్న అంశంపై స్పష్ట త ఇవ్వకుండా వాయిదాలు కోరుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ భూములకు చెందిన అన్ని పిటిషన్లపై ఈ నెల 23న విచారణ చేపడతామని అప్పుడు ఫార్మాసిటీ భూములపై నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు.