calender_icon.png 31 October, 2024 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ఎగుమతుల్లో ఫార్మా ఐదోస్థానం

08-07-2024 12:29:25 AM

బల్క్ డ్రగ్ పార్కులో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సాయం

ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తాం

ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): మనదేశ ఎగుమతుల్లో ఫార్మా ఉత్పత్తులది ఐదో స్థానమని, గత ఏడాది మనదేశం రూ. 1.83 లక్షల కోట్ల విలువైన ఫార్మా సూటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసిం దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. హైటెక్స్‌లో ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగాలకు ప్రాతినిథ్యం వహించే 50 వేల మంది ఫార్మసీ ప్రొఫెషనల్స్ పాల్గొన్న ఈ సమావేశంలో మాట్లాడటం తనకు చాలా సంతోషం గా ఉందన్నారు.

హైదరాబాద్‌ను ఫార్మసీ హబ్‌గా మార్చిన ఫార్మా ఇండస్ట్రీకి ధన్యవాదాలు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఫార్మా పరిశ్రమ మద్దతు చాలా అవసరమని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అయి దో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగా లనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి భారత్ ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలనే ప్రధాని మోదీ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పనకు పీఎం గతి శక్తి ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. 

అత్యుత్తమ రవాణా సదుపాయాలు

దేశంలో 74 విమానాశ్రయాలు సేవలు అందిస్తున్నాయని, రవాణా, హైవే బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2014 తర్వాత 500 శాతం పెరిగాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. మన నేషనల్ హైవే నెట్ వర్క్ 2014 లో 91,287 కి.మీ. ఉంటే ఇప్పుడు లక్షన్నర కి.మీకు చేరుకుందని.. 60 శాతం నెట్‌వర్క్ పెరిగిందని తెలిపారు. రైల్వే శాఖ దాదాపు 3 వేల కి.మీ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ నిర్మాణం తలపెట్టిందన్నారు. దేశ విద్యుత్ డిమాండ్ 2013- లో 136 గిగా వాట్స్ ఉండేదని.. 2023 నాటికి 244 గిగా వాట్లకు చేరుకుందని ఇది 508 శాతం పెరుగుదల అని తెలిపారు. ఈ మౌలిక సదుపాయల వల్ల ఫార్మా వంటి రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అవినీతి రహిత పాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గ్యారెంటీ లభిస్తుందన్నారు. కాలం చెల్లిన 1562 చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. 

మౌలిక వసతులకు కేంద్రం సాయం

ఆధార్, యూపీఐ, జన్‌ధన్ బ్యాంక్ ఖాతా ల ద్వారా అద్భుతమైన పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టంను ప్రభుత్వం రూపొందించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ చర్యల వల్ల ఫార్మా రంగం ఆత్మనిర్భర్‌భారత్‌లో స్వ యంసమృద్ధి సాధించేందుకు అవకాశం ఉందన్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం రూ.15 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. బల్క్‌డ్రగ్ పార్కులో కామన్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఫెసిలిటీస్‌ని పెంచడానికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు. మన ఫార్మారంగం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీం దోహదపడుతుందన్నారు. భారత ఫార్మా శక్తిని గుర్తించిన కేంద్రం అవసరమైన సహకారాన్ని అందిస్తోందని వెల్లడించారు. 

మెడికల్ సీట్లు 82 శాతం పెరిగాయి

ఆరోగ్యరంగంపై ప్రభుత్వం తీసుకున్న చర్య ల వల్ల మెడికల్ కాలేజీలు 2014లో 388 ఉంటే ఇప్పుడు 706కు పెరిగాయని కిషన్‌రెడ్డి అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు 112 శాతం పెరిగాయని స్పష్టం చేశారు. 2014లో 51,348 ఎంబీబీఎస్  సీట్లు ఉంటే అవి ఇప్పుడు 1.9 లక్షలకు పెరిగినట్టు చెప్పారు. పీజీ సీట్లు కూడా 127 శాతం పెంచామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 12 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వైద్య బీమా కల్పిస్తున్నామన్నారు. జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు తక్కువ ధరకు మందులు అందిస్తున్నామని తెలిపారు. ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఈ రంగానికి తమ ప్రభుత్వం సహకారం ఉంటుందని తెలిపారు.