31-01-2025 12:00:00 AM
వైద్య విద్య పీజీ కోర్సుల్లో స్థానికత పేరుతో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఎక్కడైనా చదువుకునే హక్కు ఉందని కూడా స్పష్టం చేసింది. చండీగఢ్ వైద్య కళాశాలలోని సగం సీట్లను చండీగఢ్ ప్రాంతంలో నివసించే వారికే కేటాయించడానికి సంబంధించి దాఖలయిన పిటిషన్‌పై బుధవారం ఇచ్చిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది.
దీంతో ఇకపై వైద్య విద్య పీజీ కోర్సుల్లో స్థానికత ఆధారంగా రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించడానికి చెల్లుచీటీ ఇచ్చినట్లయింది. మెడికల్ పీజీ కోర్సుల్లోలోకల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
పీజీ వైద్యవిద్యలో నివాసప్రాంత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సుప్రీంకోర్టులో పలువురు సవాలు చేయగా తొలుత ఇద్దరు జడ్జీల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
ఇప్పుడు ఆ ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. చండీగఢ్ మెడికల్ కాలేజీలోని 64 పీజీ సీట్లలో సగం చండీగఢ్ పూల్‌కు కేటాయించడాన్ని తప్పుబట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎక్కడైనా నివసించేందుకు, ఏ విద్యాసంస్థలో చదువుకొనేందుకు హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని స్పష్టం చేసింది.
మనమంతా భారత్ భూభాగంలో నివసిస్తున్నామని, రాష్ట్రం లేదా ప్రొవెన్షియల్ అనేది ప్రత్యేకంగా లేదని, ఉన్నది ఒక్కటే నివాసప్రాంతమని పేర్కొంది. అంతేకాదు, స్థానిక అవసరాల దృష్ట్యా ఒక రాష్ట్రంలో నివసిస్తున్న వారికి ఎంబీబీఎస్ వరకు రిజర్వేషన్ ప్రయోజనాలను కల్పించవచ్చు కానీ పీజీ కోర్సుల్లో అనుమతించడం రాజ్యాంగ విరుద్ధంగానే భావించాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది.
నీట్ మెరిట్ ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఈ తీర్పు వర్తించదని కూడా తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటికే మెడికల్ పీజీ కోర్సుల్లో స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు వర్తింపజేస్తున్న తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
దక్షిణాది రాష్ట్రాలు 50 శాతం సీట్లను స్థానికత ఆధారంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించేవి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ సీట్ల భర్తీకి రాష్ట్రాలు కౌన్సెలింగ్ నిర్వహించవచ్చు కానీ ఆ సీట్ల భర్తీ మాత్రం నీట్ మెరిట్ ఆధారంగానే జరపాల్సి ఉంటుంది. అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఆయా రాష్ట్రాల్లో అడ్మిషన్ల కోసం పోటీ పడవచ్చు.
ఉదాహరణకు తెలంగాణలో 2,924 పీజీ సీట్లు ఉన్నాయి. లోకల్ రిజర్వేన్ల ప్రకారం 1,462 సీట్లు తెలంగాణ విద్యార్థులకు వచ్చేవి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆ సీట్లు కూడా ఆలిండియా కోటాలోకి వెళ్తాయి. ఇది తెలంగాణ విద్యార్థులకు శరాఘాతమని గతంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు అంటున్నారు.
రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంతీర్పుపై రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లాలని, తీర్పుపై స్టే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య కల్పించాలన్న సదుద్దేశంతోనో లేదా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానో చాలా రాష్ట్రాలు కొన్నేళ్లుగా ఈ లోకల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి.
ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఈ సదుపాయంతో పీజీ కోర్సులు చేశారు కూడా. ఇకపై ఆ అవకాశం ఉండక పోవడంతో రాబోయే రోజుల్లో స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనేది కాదనలేని నిజం. అయితే దీనిపై చొరవ తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వాలే.