ఐఎఫ్టియు ఏరియా ఎస్ఓటు జిఎం శ్యాంసుందర్ కు వినతి
మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పిఎఫ్ కు సంబంధించిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్ టీయు వివరాలు, పెనాల్టీ రద్దు, సమయానికి వేతనాలు చెల్లింపు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి యస్ డి నాసర్ పాషా డిమాండ్ చేశారు. శుక్రవారం కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఏరియా ఎస్ఓటు జిఎం శ్యాంసుందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి సి ఎం పి ఎఫ్ వివరాలు అందజేయడంలో అన్ని ఏరియాల కంటే మణుగూరు ఏరియా ముందు వరుసలో ఉండేదని.. ఈ సారి గత మూడు సంవత్సరాల కు సంబంధించిన వివరాల జమ పాస్ బుక్స్ అందజేయడంలో చాలా జాప్యం జరిగిందన్నారు.
ఈ విషయమై ఐఎఫ్టియు గా ఎప్పటికప్పుడు పిఎఫ్ అధికారులు, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకు వచ్చిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. 2024 మార్చి వరకు మణుగూరు ఏరియా అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు, ఏరియా స్టోర్ కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రైవేటు వాహన డ్రైవర్లకు, ఉద్యాన వనాలు (పార్క్)కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సిఎం పిఎఫ్ జమ వివరాల పాస్ బుక్కులు అందజేయుటకు ఏరియా యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు, కాంట్రాక్టర్ కు యాజమాన్యం విధిస్తున్న అమానవీయ గైర్హాజరు పెనాల్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతినెల 7వ తేదీ కల్లా కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించే విధంగా చూడాలని, ఓ సి-4 కోల్ ట్రాన్స్ పోర్ట్ టిప్పర్ డ్రైవర్ల కు, క్లీనర్ల కు సంబంధించి ఐదు వేల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి వెంటనే చెల్లించాలని, పీకే ఓసి వాషింగ్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులకు పెరిగిన వేతనాల ఏరియర్స్ చెల్లించాలిని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, నల్ల రమేష్, ఏరియా అధ్యక్షులు ఆంగోత్ మంగీలాల్, సాధన పల్లి రవి,ఏరియా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నునావత్ బాలు, జే వి ప్రసాద్, కే గురుమూర్తి, కే నాగేశ్వరరావు, యు శివరామకృష్ణ, షేక్ రజబ్ అలీ, ఎం వెంకటేశ్వర్లు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.