calender_icon.png 17 September, 2024 | 1:23 AM

పెట్రో ధరలు తగ్గే అవకాశం

07-09-2024 02:13:19 AM

  1. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో నేపథ్యంలో నిర్ణయం 
  2. అంతర్జాతీయంగానూ క్షీణించిన క్రూడాయిల్ ధరలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ రేట్లు 9 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన నేపథ్యంలో చమురు కంపెనీల లాభాలు మెరుగుపడ్డాయి. దీంతో వినియోగదారులకు సైతం ధరలు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. జనవరి నుంచి చమురు ధరలు తగ్గుతున్న కారణంగా ఈ అంశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెట్రో ధరల తగ్గింపు ప్రజలకు ఊరటనిచ్చే అవకాశంగా కేంద్రం భావిస్తోంది. బుధవారం అమెరికా ముడి చమురు 1 శాతం క్షీణించి బ్యారెల్ ధర 70 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా ఒక శాతం తగ్గి బ్యారెల్‌కు 72.75 డాలర్లకు చేరుకున్నాయి. చమురు మార్కెట్‌లోకి లిబియా మళ్లీ అడుగుపెట్టడం వల్ల ధరలు తగ్గినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తిని తగ్గించి చమురు ధరలను నియంత్రించే అవకాశముందని తెలుస్తోంది.