calender_icon.png 17 October, 2024 | 11:03 PM

పెట్రోల్, డీజిల్‌ని రూ.2-3 తగ్గించవచ్చు: ఇక్రా

27-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని లీటరుకు రూ.2-3 మేర తగ్గించే అవకాశం ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్నదని రేటింగ్ ఏజన్సీ ఇక్రా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరల్ని లీటరుకు రూ.2 తగ్గించిన సమయంలో సగటున 83-84 డాలర్లున్న బ్యారల్ క్రూడ్ ధర సెప్టెంబర్‌లో 74 డాలర్లకు దిగిందని ఇక్రా గురువారం విడుదల చేసిన నోట్‌లో వివరించింది. ప్రపంచ మార్కె ట్లో క్రూడ్ ధరలు తగ్గిన ప్రభావంతో దేశంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రిటైల్ అమ్మకాల ద్వారా వచ్చే లాభాల మార్జిన్లు పెరిగాయని పేర్కొంది.

ఈ కారణంగా ప్రస్తుత స్థాయిలోనే క్రూడ్ ధరలు స్థిరంగా నిలిస్తే రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించే వెసులుబాటు ఆ కంపెనీలకు ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ విశ్లేషించింది. ఈ సెప్టెంబర్ నెలలో (17వ తేదీవరకూ) అంతర్జాతీయ పెట్రో ఉత్పత్తుల ధరలతో పోలిస్తే  దేశీయ మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్‌పై నికర మార్జిన్ లీటరుకు రూ.15 మేర, డీజిల్‌పై నికర మార్జిన్ 12 మేర అధికంగా ఉన్నదని తెలిపింది. ఈ ఏడాది మార్చి 15న తగ్గింపు తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించలేదని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ గ్రూప్ హెడ్  గిరీశ్‌కుమార్ తెలిపారు.