calender_icon.png 25 October, 2024 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవాలు వెల్లడించని పిటిషన్లను అనుమతించం

28-08-2024 12:37:59 AM

ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ బీకేగూడలో సర్వే నంబర్ 102/3, 102/2లోని 1537 చదరపు గజాల ఆటస్థల రక్షణలో అధికారులు విఫలమయ్యారని, రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలివ్వాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశంపై గతంలో ఒక పిటిషన్ దాఖలు చేసి ఉపసంహరించుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది.

బీకే గూడలోని 1537 చదరపు గజాల స్థలానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులతో అధికారులు కుమ్మక్కయి రక్షణ చర్యలు చేపట్టలేదంటూ స్వచ్ఛ తెలంగాణ యూత్ అసోసియేషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ స్థలంలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని ప్రైవేటు వ్యక్తులు అజయ్‌కుమార్ అగర్వాల్ తదితరులు పిటిషన్ వేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. స్వచ్ఛ తెలంగాణ యూత్ అసోసియేషన్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1537 చదరపు గజాలకు సంబంధించి సివిల్ కోర్టు ఇచ్చిన శాశ్వత ఇంజంక్షన్ ఉత్తర్వులపై ఏపీహెచ్‌బీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉపసంహరించుకుందని చెప్పారు.

ప్రైవేటు వ్యక్తులతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమ తల్లి శాంతి అగర్వాల్ 1963లో 102/3 సర్వే నంబర్‌లో 2 వేల గజాలు కొనుగోలు చేశారని, ఇందులో 262 గజాల్లో ఏపీహెచ్బీ రోడ్డు నిర్మాణం చేపట్టిందన్నారు. దీనికి ప్రత్యామ్నాయ స్థలం లేదంటే రూ.62.90 లక్షల పరిహారం చెల్లించాలని పిటిషన్‌ను సివిల్ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఇరుపార్టీల అంగీకారంతో సివిల్ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.

వాదనలను విన్న ధర్మాసనం ఎకనమిక్ వీకర్ సెక్షన్ ప్రైవేట్ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ 2016లో పిటిషన్ దాఖలు చేసి, ఉపసంహరించుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా తొక్కిపెట్టిందని పేర్కొంది. దురుద్దేశంతో అన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకురాకపోవడం వల్ల ఇందులో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు భూమిని స్వాధీనం చేయాలన్న పిటిషన్‌ను సైతం కొట్టివేసింది. భూమి ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఉందన్న విషయాన్ని ఈ కోర్టు తేల్చజాలదని, అందువల్ల దీన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవాలంటూ తీర్పు వెలువరించింది.