- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపైనే అధిక అభ్యర్థనలు
- సమగ్ర సర్వేపై అనుమానాలు వద్దు
- బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాల్లో చేపట్టిన బహిరంగ విచారణలో 1,224 వినతులు స్వీకరించినట్టు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. సోమ వారం హైదరాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ స్థితిగతులపై రాష్ట్రస్థాయి బహిరంగ విచారణ నిర్వహించారు.
దాదాపు ౬౦౦ మంది ప్రజలు, పలు కులసంఘాల ప్రతినిధులు పాల్గొనగా ౫౮ వినతులు వచ్చినట్టు కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఇందులో ప్రధానంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలని, గ్రూపులు మార్చాలని, వివిధ కులాల ఫెడరేషన్ల ఏర్పాటు వంటి పలు అంశాలు కమిషన్ దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు.
కులగణనపై అనుమానాలు అవసరం లేదని.. ఏ కులానికి చెందిన జనాభా ఎంత ఉందో తెలుసుకునేందుకు చేపట్టిన సర్వేలో అందరూ పాల్గొని వివరాలివ్వాలని పిలుపునిచ్చారు. బీసీ కమిషన్ వద్ద తగిన సిబ్బంది లేక ప్రణాళికాశాఖకు సర్వే బాధ్యతలు అప్పగించినట్టు ఆయన స్పష్టం చేశారు. సర్వే వివరాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో హైకోర్టుకు అందజేస్తామని తెలిపారు.
తార్నాకలో సర్వే పత్రాలు రోడ్డు మీద పడిన ఘటనలో సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అధిక సంఖ్యలో వినతులు సమర్పించారని తెలిపారు. వినతులు సమర్పించాలనుకునే వారి కోసం మంగళవారం కమిషన్ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహిస్తామని చెప్పారు.
సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ జీ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.