- నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకోలేం
- తేల్చిచెప్పిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): గ్రూప్1 నియామకాలపై గత ఫిబ్రవరిలో జారీచేసిన నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్1 నోటిఫికేషన్, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది.
దివ్యాంగులకు రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ 2018లో జారీచేసిన జీవో 10, 2019లో జారీ చేసిన జీవో 96, ఈ ఏడాది వెలువడిన జీవో 29ని సవాల్ చేస్తూ ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కొట్టివేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జీ రాధారాణితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.
నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టును ఆశ్రయించడంలో సుదీర్ఘ జాప్యం జరిగిందని తప్పుపట్టింది. జాప్యానికి కారణాలను వివరించలేదని ఆక్షేపించింది. పిటిషనర్లు, ప్రభుత్వ వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వెలువరిస్తూ.. ‘2022లో వెలువడిన నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ప్రిలిమ్స్ రద్దు అయ్యాయి.
దీంతో గత ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. గత జులై 7న తుది కీ విడుదల వెలువడింది. మెరిట్ లిస్ట్ వెలువడ్డాయక పిటిషనర్లు కోర్టుకు వచ్చారు. జీవో 29ను అధికారిక వెబ్‌సైట్లో అప్లోడ్ చేయకపోవడం వల్ల ఆలస్యమైందన్న పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యంగా లేదు.
ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ అయ్యాక సమాచార హక్కు చట్టం కింద జీవో కాషీని పొందేందుకు పిటిషనర్లు ప్రయత్నాలు చేయలేదు. గత నోటిఫికేషన్ మేరకు పరీక్ష నిర్వహించాలనే పిటిషన్లను గతంలోనే హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేసింది. ప్రిలిమ్స్ రద్దు చేసి పాత నోటిఫికేషన్ మేరకు నిర్వహించాలనే పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం కాదు.
అందుకే పిటిషన్లను కొట్టేస్తున్నాం. వెబ్‌నోట్, డీకోడింగ్ వెబ్‌నోట్ అంశాల జోలికి వెళ్లట్లేదు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తదనంతర పరిణామాలపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించవచ్చు’ అని స్పష్టంచేసింది.
ఇరుపక్షాల వాదనలు ఇలా..
గత జీవోల ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని, 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు పిలవాలని పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. రిజర్వేషన్ క్యాటగిరీకి చెందిన వాళ్లను మెరిట్ జాబితాలో చూపడం అన్యాయని అన్నారు. ఉదాహరణకు 200 జనరల్ క్యాటగిరీ పోస్టులకు 1:50 నిష్పత్తిలో 10,540 మం దిని మెయిన్స్‌కు ఎంపిక చేశారని, అదేవిధంగా అన్ని క్యాటగిగీలకూ ఎంపిక చేయాల న్నారు.
ఇందుకు విరుద్ధంగా జాబితాను సిద్ధం చేశారని ఆరోపించారు. 2022లో జారీచేసిన నోటిఫికేషన్ మేరకు పరీక్షలను నిర్వహించాలని కోరారు. ఆ నోటిఫికేషన్‌లో 503 పోస్టులు ఉంటే ప్రస్తుతం 583 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిందని చెప్పారు. గతంలో గ్రూప్1 ప్రిలిమ్స్‌లో అక్రమాలు జరిగాయని చెప్పి వాటిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు.
ఆ తర్వాత టీజీపీఎస్సీ సుప్రీంకోర్టులో అప్పీల్ వేసిందని, ఆపై ఉపసంహరించుకుందన్నా రు. తాజాగా గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసిందని వివరించారు. అప్పటికే నియామక ప్రక్రియకు సంబంధించి ఫిబ్రవరి 8న జీవో 29 వెలువరించిందని చెప్పారు. తొలి నోటిఫికేషన్ వెలువడ్డాక రూల్స్ మార్చడానికి వీల్లేదని అన్నారు.
ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. నిబంధనలు సవరించడం వల్ల పిటిషనర్లకు ఎలాంటి నష్టం జరగడంలేదన్నారు. రిజర్వేషన్ క్యాటగిరీకి చెందిన వారికి మెరిట్ జాబితాల్లో ఎంపిక కాని పక్షంలో వారిని రిజర్వుడు క్యాటగిరీగానే పరిగణిస్తామని అన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.