ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో మద్యం వ్యాపారులు చేస్తున్న అక్రమ, ఆర్థిక దోపిడిని అరికట్టాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah)కు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పడిదల నవీన్ ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ నందు వినతిపత్రం అందించారు. ప్రజలకు అవసరమైన మద్యం బ్రాండ్లను వైన్ షాపులో ఉంచకుండా బెల్ట్ షాపులకు అక్రమంగా తరలిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో ఎంఆర్పిపై 30 నుండి 40% అధిక ధరలకు అమ్ముతూ ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారన్నారు. వైన్ షాపుల్లో అధిక కమిషన్ వచ్చే, ఎప్పుడు వినని, కనని కొత్త బ్రాండ్లను ప్రజలకు అంటగడుతున్నారన్నారు. నాణ్యతలేని ఈ బ్రాండ్ల వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు అవసరమైన బ్రాండ్లను వైన్ షాపుల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.