జగిత్యాల, జనవరి 30 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లోని గాంధీ విగ్రహాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ర్ట వ్యాప్తంగా జరిపిన నిరసనల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ అసమర్ధ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించి, ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడాలని మహాత్మా గాంధీకి ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డి మనసు మార్చి ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన కొనసాగించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం ప్రియాంక ప్రవీణ్, ఆనందరావు, వొల్లం మల్లేష్, తుమ్మ గంగాధర్, గంగారెడ్డి వెంకటేశ్వర్లు నక్క గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు..
మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా, కరీంనగర్ జిల్లా కేద్రంలో, గాంధీజీ విగ్రహానికి పూల మాలవేసి నివాళ్ళు అర్పించి తదుపరి కాంగ్రెస్ పార్టీ నేటితో అధికారంలోకి వచ్చి 420 రోజులు అయినందున వారు ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు పూర్తి చేయలేదని నిరసనగా వినతిపత్రం అందచేశారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, మాజీ సుడా చైర్మన్ జి వి రామకష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్ రావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.