17-04-2025 11:01:44 PM
ఆరు రోజుల వయసు గల కుక్కపిల్లలను చంపిన వ్యక్తి
అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): ఒక అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లో సేద తీరుతున్న మూగ జీవాల (కుక్క పిల్లల) పట్ల ఓ వ్యక్తి అమానవీయంగా వ్యవహరించి, ఆ కుక్క పిల్లలను కిరాతకంగా చంపేసిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఫతేనగర్‌లో ఇటీవల ఓ వీధి కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆరు రోజుల వయసు గల ఆ కుక్కపిల్లలు ఎండతీవ్రతకు తట్టుకోలేక ఓ గేటెడ్ కమ్యూనిటీ సెల్లార్‌లోకి వెళ్లాయి. సెల్లార్‌లో వాటిని గమనించిన ఓ వ్యక్తి వాటిని నేలకేసి కొడుతూ, వాటి గొంతును కాలుతో తొక్కుతూ రాక్షసానందం పొందాడు.
అనంతరం కుక్కపిల్లలు చనిపోవడం గమనించిన స్థానికులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఉండే ఆశీష్ అనే వ్యక్తే వాటిని చంపేసినట్లు వెల్లడైంది. కాగా జంతుప్రేమికులు, అపార్ట్‌మెంట్ వాసులు అతన్ని ప్రశ్నించగా తన పెంపుడు కుక్క దగ్గరకు రాకుండా అడ్డుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ సీసీ కెమెరాలో అతను వాటిని చంపిన దృష్యాలు రికార్డు కావడం గమనార్హం. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. కాగా మూగ జీవాలపై వీధుల్లో జరుగుతున్న దాడులను అరికట్టాలని, వాటికి కారణమయ్యే వారిని కఠినంగా శిక్షించాలని జంతు సంక్షేమ కార్యకర్త ముదావత్ ప్రీతి డిమాండ్ చేశారు.