calender_icon.png 16 March, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుదల ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు!

16-03-2025 12:56:44 AM

ఆశ, ఆశయం రెండు ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగొచ్చని చెప్తుతున్నారు నిజామాబాద్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జడ్జి సునీత కుంచాల. జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తన వంతు బాధ్యతగా అమ్మాయిలకు అవసరమయ్యే కార్యక్రమాలను చేపట్టి భావితరాలకు ఆద్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మాయిలకు పలు సూచనలు చేస్తూ.. ఆమె చేపట్టిన కార్యక్రమాల గురించి విజయక్రాంతితో పంచుకున్నారిలా.. 

జడ్జి కావాలన్న పట్టుదలతో ఇంటర్మీడియట్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తి చేశా.. అప్పటికి నాకు పెళ్లి అయింది. అనంతరం కుటుంబం, పిల్లల బాధ్యత నాపై పడ్డది. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే.. నా ఆశయాన్ని నెరవేర్చుకున్నా. అలా జూనియర్ జడ్జి నుంచి జిల్లా జడ్జి స్థాయికి ఎదగడానికి  నాకు దాదాపు 20 సంవత్సరాల సమయం పట్టింది.

మొదటిసారి నాకు ఆదిలాబాద్ జిల్లా జడ్జిగా.. తర్వాత రంగారెడ్డి జిల్లా, నాంపల్లి కోర్టు సంగారెడ్డి తర్వాత ప్రమోషన్ పై నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌గా జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. పలుమార్లు నోటిఫికేషన్ అటెండ్‌లో విఫలమైనప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సాధన చేశా.. కాబట్టి ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తున్నా.  

అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే!

సమాజంలో అమ్మాయిలపై పెరుగుతున్న అఘాయిత్యాలు తగ్గాలంటే అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. నిజామాబాద్ జిల్లాలో 99 పోక్సో కేసులు నమోదు కాగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరంగా నిందితులను శిక్షించగలం కానీ కొత్తగా మరెవరూ బాధితులుగా మారకుండా ఉండాలంటే అమ్మాయిలు ప్రతిఘటించే విధంగా తయారు కావాలి.

స్వీయ రక్షణ కోసం చిన్నప్పటినుంచే అమ్మాయిలకు తల్లిదండ్రులు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉంది.  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 14 వేల మంది మహిళలు విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇలా నేర్పించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 

క్యాన్సర్ బారినపడకుండా.. 

సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న ఆడపిల్లలకు సానిటరీ నాప్కిన్స్ అందుబాటులోకి తెచ్చాం. 11 ప్రభుత్వ పాఠశాలలకు సానిటరీ నాప్కిన్స్ అందించే వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేశాం. ప్రతి విషయాన్ని అమ్మాయిలతో చర్చించి తగిన వైద్య ఇతర సదుపాయాలను వారికి కల్పించాలి. కుటుంబ సభ్యులు అమ్మాయిలతో స్నేహంగా ఉన్నప్పుడే వారి సమస్యలు చెబుతారు. లేదంటే మానసికంగా కృంగిపోయే ప్రమాదం ఉంటుంది.  

ప్రోత్సహించాలి.. 

పెళ్లి తర్వాత ఆడపిల్లలు కొద్ది రోజుల్లోనే తిరిగి పుట్టింటికి వచ్చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని నిలబడి బతికే శక్తి వారికి కల్పించాలి. ఆడపిల్లలను గౌరవించే పద్ధతి ముందుగా మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంట్లో ఉండే సభ్యులందరూ అక్క, చెల్లి, తల్లినే కాకుండా సమాజంలో ప్రతి మహిళను గౌరవించేలా ప్రోత్సహించాలి.  

అప్పుడే సమాజంలో ప్రతి స్త్రీ ధైర్యంగా నిలబడుతుంది. అమ్మాయిలకు తగిన సపోర్టు కుటుంబం, స్నేహితుల నుంచి లభిస్తే.. వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టుగానే ప్రతి స్త్రీ వెనుక తండ్రి, అన్న, తమ్ముడు, స్నేహితులు తప్పకుండా ఉంటుంది. 

బాధకరమైన విషయం.. 

తల్లిదండ్రులు ఉద్యోగాల్లో, ఇతర పనుల్లో పడి పిల్లలపై దృష్టి సారించలేకపోతున్నారు. స్కూల్‌కు వెళ్లిన పిల్లలు సాయంకాలం నాలుగింటికి ఇంటికి చేరగానే వారికి ఏం చేయాలో తోచడం లేదు. చేతికందిన సాధనలతో తెలిసీ తెలియని వయసులో తప్పటడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆడపిల్లలకు రక్షణగా ఉండేది. ఇంట్లో తాత, అమ్మమ్మ, నానమ్మ, పెద్దవాళ్లు ఉన్నంతకాలం స్కూల్ నుంచి రాగానే వారి సంరక్షణలో పిల్లలు ఉండేవారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. పెద్దవాళ్లని వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. 

పాతరోజులు వస్తే బాగుండు.. 

ఇప్పటి పిల్లలకు రామాయణం, మహాభారతం గురించి తెలియకుండా పోయింది. ఇంట్లో పెద్దవారు ఉంటే నీతి కథలు చెప్పి వారి బుద్ధికి పదును పెట్టేవారు. ఈ ప్రక్రియలో పిల్లలు చెడు మార్గాలకు పోకుండా జాగ్రత్తగా ఉంటారు. మళ్లీ పాత రోజులు రావాలి. 

సెల్ఫ్ డిఫెన్స్ అవసరం..

ప్రతి మహిళా ఓ నారీ శక్తిగా మారాలి..  స్వీయ ఆత్మరక్షణ ( సెల్ఫ్ డిఫెన్స్) అనేది చాలా అవసరం. బడికి వెళ్లే పిల్లలు తమకు ఎదురైన అనుభవాలను ఇంటికి వచ్చి పెద్దలకు చెబుతుండాలి.. ఇలాంటి వాతావరణాన్ని కల్పించాలి. ఆడపిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులకు చెప్పకుండా ఉంటున్నారు..  ఫలితంగా తెలిసి తెలియని వయసులో ఎన్నో అఘాయిత్యాల బారిన పడుతున్నారు.

అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలి. చదువుతోపాటు శిక్షణ కూడా ఓ భాగం కావాలి. అప్పుడే ఆడపిల్లలు సురక్షితంగా ఉండగలుగుతారు. కేజీబీవీ విద్యార్థులకు విధిగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇదే తరహాలో. అన్ని విద్యాసంస్థల్లో కూడా అమలు చేస్తున్నాం.

అందుకోసం అన్ని విద్యాసంస్థలకు తగిన సూచనలు ఇస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. నిరంతర ప్రక్రియగా ఈ కార్యక్రమాలు చేపడితే ఆడపిల్లల్లో ధైర్యం పెరుగుతుంది. ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకునే స్థాయికి ఎదుగుతారు. 

 ప్రమోద్, నిజామాబాద్ జిల్లా