calender_icon.png 1 April, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీని నమ్మితే బూడిదే మిగిలింది!

31-03-2025 12:00:00 AM

బూడిద లిఫ్టింగ్లో తీరని అన్యాయం

ప్రభావిత ప్రాంత గ్రామాలకు మొండి చేయి 

నేటితో ముగియనున్న అనుమతులు

ఆందోళన బాటలో ప్రభావిత గ్రామాల యువత 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 30 (విజయక్రాంతి): భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5, 6, 7 దశల కర్మాగారాలకు చెందిన బూడిద చెరువు నుంచి గత ఎనిమిదేళ్లుగా బూడిదను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ప్రభావిత గ్రామాల యువతకు ప్రస్తుతం తీరని అన్యాయం జరుగుతుం ది. బూడిద కాలుష్యంతో తీవ్ర అనారోగ్య పాలవుతున్నా.. జెన్కో యాజమాన్యం తమకు ఉపాధి కల్పిస్తుందేమో అనే ఆశతో అన్ని భరించినా చివరకు తీరని అన్యాయం చేస్తున్నదని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆదివారం విజయక్రాంతి ప్రతినిధితో వారు మాట్లాడుతూ.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాజమాన్యంకు నామమాత్రపు రుసుం చెల్లిస్తూ బూడిద ను తరలించి  కుటుంబాలను పోషిస్తూ వచ్చామనీ తెలిపారు. తామంతా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నా.. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తమకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తెలిపారు. కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన తమకు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బూడిద చెరువు ప్రభావిత ప్రాంతాలైన కరకవాగు, పునుకుల, పుల్లయ్యగూడెం, సూరారం గ్రామాల యువతకు నేడు ఉపాధి కరువైందనీ వాపోయారు. ఈ ఏడాది కేవలం ముగ్గురికే ఉపాధి కల్పించారన్నారు.  

కోర్టు ఆదేశాలు ఉన్నా..

బూడిద లిఫ్టింగును గిరిజన ఏజెన్సీలకు ఇస్తూ పిటిషనర్లకు అవకాశం కల్పించాలని కోర్టులో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. అధికారులు మాత్రం గిరిజన ఎజెన్సీలను విస్మరించి, పిటిషనర్లలైన ముగ్గురికి మాత్రమే ఉపాధి కల్పించారని ఆరోపించారు. ఐటీడీఏ పీవో ఎంపిక చేసినా.. లిఫ్టింగ్ అవకాశం ఇవ్వడం లేదని గిరిజన సంఘాల నాయకులు ఆరు నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు. ఆ వెనక అధికార పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

నేటితో అనుమతి ముగింపు

బూడిద లిఫ్టింగ్ అనుమతులు సోమవారంతో ముగియనున్నాయి. కోర్టు ఆదేశాలతో పిటిషనర్లైన  ముగ్గురికి 2024 నవంబర్లో 6 నెలల కాల వ్యవధికి జెన్కో యాజమాన్యం బూడిద లిఫ్టింగ్ కు అనుమతి ఇచ్చింది. ఆ కాల పరిమితి నేటితో ముగుస్తుంది. ఇకనైనా ప్రభావిత గ్రామాల గిరిజన సంఘాలకు లిఫ్టింగ్ కేటాయిస్తుందో?, లేదంటే రాజకీయ బలానికి తలొగ్గి మళ్ళీ  ఆ ముగ్గురికే ఆదేశాలు పొడిగిస్తుందో? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ అధికారులు తమకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.ఈ విషయమై కేటీపీఎస్ 5 6 దశల సీఈ ప్రభాకర్ రావును వివరణ కోరగా బూడిద లిఫ్టింగ్ అనుమతులు ఈనెల 31తో కాల వ్యవధి ముగుస్తున్న మాట వాస్తవమే నన్నారు. తదుపరి విద్యుత్ సౌధా నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో వేచి చూడాల్సిందేనన్నారు.