* మద్యం దుకాణాల్లో అడ్డగోలు దందాలు
* సెంటీమీటర్ చొప్పున పర్సంటేజీల వసూళ్లు
* స్టఫ్ ధరల పెంపుతో మద్యం ప్రియుల జేబులకు చిల్లులు
* కందనూలు జిల్లాలో విచ్చలవిడిగా సిట్టింగ్ కేంద్రాలు
* మామూళ్ల మత్తులో అధికారులంటూ విమర్శలు
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): మద్యం దుకాణాల పక్కనే అక్రమంగా పర్మింట్ రూమ్స్‌ను ఏర్పాటు చేసి.. స్టఫ్, చికెన్ ధరల పెంపుతో మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. అదేవిధంగా మద్యం దుకాణాలకు సమీపంలోనే చికెన్, మటన్, చేప ఫ్రై సెంటర్లు ఏర్పాటు చేసి అందులోనే సిట్టింగ్ కేంద్రాలు పుట్టగొడుగులుగా వెలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల్లో 100 సెంటీమీటర్ల విస్తీర్ణంలో పర్మిట్ రూమ్ ఉండాలి.
కానీ జిల్లాలోని 67 మద్యం దుకాణాల్లో సుమారు 600 గజాలకు పైగా విశాలవంతమైన పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఒక్కో రూమ్‌లో దాదాపు 50 మందికి పైగా సిట్టింగ్ సెటప్ చేసి నిలువునా దోచుకుంటున్నారు. మద్యం దుకాణాల కోసం కొనుగోలు చేసిన లిక్కర్‌ను వాటికి సమీపంలోని సిట్టింగ్ కేంద్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
డిసెంబర్ చివరి వారం కావడంతో మద్యం మరింత ఎక్కువ అమ్ముకునేందుకు పర్మిట్ రూంలు, సిట్టింగ్ కేంద్రాలు, బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆబ్కారీ, పోలీస్ శాఖ అధికారులు రూ.లక్షల్లో మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
స్పందించని ఆబ్కారీ అధికారులు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, తెలకపల్లి సర్కిల్ పరిధిలో 67 మద్యం దుకాణాలతో పాటు 6 బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. వీటిలో అధిక ధరలు వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు పలుమార్లు ఆబ్కారీ శాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆరోపిస్తున్నారు.
పాఠశాలలు, ఆలయాలు, బస్టాండ్ పరిసరాల్లో సిట్టింగ్ కేంద్రాల ఏర్పాటుతో ప్రయాణికులు, భక్తులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్టు నిత్యం ఆబ్కారీ శాఖకు ఫిర్యాదులు అందుతున్నా.. మాముళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
మద్యం దుకాణాల్లో అదనంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్‌లకు సెంటీమీటర్ల చొప్పున పర్సంటేజీలు అందుతున్నట్టు ఆరోపణ. సిట్టింగ్ సెట్ చేసిన ప్రతి చికెన్ ఫ్రై సెంటర్ నుంచి పోలీస్, ఆబ్కారీ శాఖకు వేర్వురుగా నెలవారీ ముడుపులు అందుతున్నట్టు సమాచారం.
దీంతో పాటు ఎక్సైజ్, పోలీస్ శాఖ సిబ్బందికి తరుచూ సిట్టింగ్ ఏర్పాటు చేయాల్సి వస్తోందని నిర్వాహకులు మండిపడుతున్నారు. అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలకు విచ్చలవిడి సిట్టింగ్ కేంద్రాలే కారణమని చెంచులు ఆరోపిస్తున్నారు. మద్యం సీసాలు, వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలను సిట్టింగ్ ప్రాంతంలోనే విడిచిపెడుతున్నట్టు అటవీ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.