- గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల నిర్వాకం
- ఇంటి నంబర్ల కేటాయింపులకు భారీగా వసూళ్లు
- నిబంధనల పేరుతో ఇంటి నిర్మాణ అనుమతులకు నిరాకరణ
- డబ్బులిస్తే వెంటనే ఫైల్ క్లియర్
- కొత్త వెంచర్లలో గుడ్‌విల్‌గా ప్లాట్లు తీసుకుంటున్న వైనం
సంగారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): గ్రామాల్లో సర్పంచుల పర్యవేక్షణ కొరవడి పంచాయతీ కార్యదర్శుల ఇష్టారాజ్యంగా మారుతోంది. పని స్థాయిని బట్టి కార్యదర్శులకు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేయి తడిపితేగానీ వివిధ పనులకు అనుమతులు లభించడం లేదు.
ఇంటి అనుమతులు, ఇండ్లకు నంబర్ల కేటాయింపు తదితర వాటికి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామపంచాయతీలున్నాయి. ప్రభుత్వం ప్రతీ పంచాయతీకి కార్యదర్శులను నియమించింది. గ్రామాల్లో ఇంటి నిర్మాణానికి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటికి అనుమతులు మంజూరు చేయాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉంటుంది.
కాగా కొందరు కార్యదర్శులు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం లేదు. తమను కలిసి ముడుపులు అప్పజెప్పిన వారికే ఇంటి నిర్మాణానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేస్తున్నారు. గురు వారం అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన సచిన్ ఇంటి నంబర్ కోసం డబ్బులు తీసుకున్న వీడియోపై ఏసీబీ అధికారులు విచారించారు.
అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో జిల్లాలో కార్యదర్శుల అవినీతి భాగోతం తెరపైకి వచ్చింది. కార్యదర్శులు అవినీతి, అక్రమాలు ఒక్కోటిగా వెలుగుచూస్తున్నా జిల్లాస్థాయి అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులను పర్యవేక్షించే అధికారులు సైతం అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఓ జిల్లా స్థాయి అధికారి కొందరి నుంచి డబ్బులు తీసుకొని అధిక ఆదాయమున్న పంచాయతీలకు డిప్యూటేషన్లు ఇస్తున్నట్లు తెలిసింది. పంచాయతీల్లో 2024, ఫిబ్రవరి 3 నుంచి ప్రత్యేక అధికారుల సాగుతోంది. ప్రత్యేక అధికారులు సైతం గ్రామాలకు రావడం లేదు. సంతకాల కోసం కార్యదర్శులను వారు పని చేసే కార్యాలయానికే రికార్డులు తీసుకురమ్మని పురమాయిస్తున్నారు.
సంగారెడ్డి, పటాన్‌చెరు డివిజన్‌లలో..
సంగారెడ్డి, పటాన్‌చెరు డివిజన్లలో పనిచేసే కార్యదర్శులు భారీ గా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు కార్యదర్శులు జిల్లాస్థాయి అధికారులకు లక్షల్లో ముట్టజెప్పి పటాన్‌చెరు, అమీన్‌పూర్, గుమ్మడిదల, జిన్నారం, హత్నూర, కంది, సంగారెడ్డి, కొండాపూర్, రాంచంద్రపురం, సదాశివపేట మండలాల్లో పోస్టింగులు తీసుకుంటున్నారని తెలిసింది.
ఈ డివిజన్‌లలో పనిచేసే కొందరు కార్యదర్శులు జిల్లా స్థాయి అధికారికి ప్రతినెలా ముడుపులు చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
గుడ్‌విల్‌గా ప్లాట్లు
జహీరాబాద్, నారాయణఖేడ్, ఆం దోల్ డివిజన్లలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నా యి. ఈ నేపథ్యంలో ఆయా డివిజన్లలోని గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. రియల్ వ్యాపారులు కొత్తగా వెంచరు ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. కొందరు కార్యదర్శులు రియల్ వ్యాపారుల నుంచి గుడ్‌విల్‌గా వెంచర్లలోని ప్లాట్లు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
జహీరా బాద్ డివిజన్‌లోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్‌కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలంలో పంచాయతీ కార్యదర్శులు అవినీతి అక్రమాలకు పాల్పడుతు న్నారనే విమర్శలున్నాయి. నారాయణఖేడ్ డివిజన్‌లో నారాయణఖేడ్, మనూ ర్, నిజాంపేట, కల్హేర్, కంగ్టి, నాగిలిగిద్ద, సిర్గాపూర్, ఆందోల్‌లోని ఆందోల్, చౌటాకూర్, పుల్కల్, వట్‌పల్లి, మునిపల్లితో పాటు పలు మండలాల్లో అక్రమాలు పెరిగాయి.
పంచాయతీ కార్యదర్శుల పర్య వేక్షణ బాధ్యతలు మండల పంచాయతీ అధికారులు చేయాలి. డివిజన్ పంచాయతీ అధికారులు లేకపోవడంతో రెండు డివిజన్‌లకు ఒక్క అధికారి పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడి కార్యదర్శుల అక్రమాలకు అంతులేకుండా పోతుంది.