- ఫ్యాక్టరీలో డైరెక్టర్‌గా బీఆర్‌ఎస్ నేత తలసాని సాయికిరణ్
- నిర్మాణానికి బీజేపీ నేత భూమి ఇచ్చారు
- గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృది శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలో నిర్మించనున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు.
బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీపై ఎలాంటి పక్రియ చేపట్టలేదన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్‌ఎస్, బీజేపీలు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో డైరెక్టర్‌లుగా బీఆర్‌ఎస్ నేతలు తలసాని సాయికిరణ్, మరో వ్యక్తి ఉన్నారని గుర్తు చేసారు.
ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు దాడి చేయడాన్ని మంత్రి ఖండించారు. ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారిలో బీజేపీ నేత ఉన్నట్లు చెప్పారు. ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని పాత్రపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న కేటీఆర్ నిర్మల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ముక్కు నేలకు రాయాలన్నారు.
సమావేశంలో విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కరీంనగర్ జిల్లా లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్, నిర్మల్,ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ శ్యామ్ నాయక్ పాల్గొన్నారు.