27-03-2025 12:48:09 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. మార్చి 26(విజయక్రాంతి) : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లే - అవుట్లకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ లేఔట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్ల అనుమతుల జారీ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశంలో జిల్లా కేంద్రానికి సంబంధించి మూడు లేఅవుట్ల కోసం వచ్చిన దరఖాస్తుల పై కలెక్టర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్, డిఎల్‌పిఓ, ఆర్‌అండ్‌బి, టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి కలెక్టర్ క్లియరెన్స్ అడిగారు.
ఆయా శాఖల అధికారులు వచ్చిన మూడు లే అవుట్ లలో ఒక దానికే క్లియరెన్స్ ఇచ్చారు. మిగతా రెండు లే అవుట్ల కు నీటి పారుదల శాఖ అధికారి శాఖ పరమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, పి ఆర్ ఐ ఈ ఈ హిర్యా నాయక్, నారాయణ పేట మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, కోస్గి కమిషనర్ నాగరాజు, మండల ఇరిగేషన్ ఎఈ, టిపిఓ కిరణ్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల కు సంబంధించి అంచనా బడ్జెట్ గణాంకాలను కలెక్టర్ పరిశీలించారు.