- ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్‌కి హైకోర్టు ఆదేశం
- తెలంగాణకు కరెంటు అమ్మరాదని..
- ఐఈఈకి గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా లేఖ
- కారిడార్ బకాయిలు పేరుకుపోవటమే కారణం
- హైకోర్టులో విద్యుత్తు శాఖ అధికారుల సవాల్
- ఐఈఈకి రాసిన లేఖను సస్పెండ్ చేసిన హైకోర్టు
- కొనుగోళ్లను అనుమతించాలని ఐఈఈకి సూచన
- తదుపరి విచారణ దసరా తర్వాతకు వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఇండి యన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ (ఐఈఈ) నుంచి విద్యుత్తు కొనుగోలు చేకుండా విధించిన నిషేధాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. రోజువారీ విద్యుత్తు కొనుగోలుకు అనుమ తించాలని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం ఐఈఈకి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 60 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలు చేయడానికి ఎస్పీడీసీఎల్‌కు అడ్డంకులు తొలిగాయి.
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు సరఫరా నిమిత్తం బుక్ చేసుకున్న కారిడార్ బకాయిలు చెల్లించనందున తెలం గాణ డిస్కంలకు విద్యుత్తు క్రయ, విక్రయాలకు అనుమతించరాదంటూ ఐఈ ఈకి గురువారం గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని, ఆ లేఖను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కారిడార్ బకాయిలకు సంబంధించిన వివాదం కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి (సీఈఆర్సీ) వద్ద పెండింగులో ఉండదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఐఈఈకి నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లేఖ రాసి తెలంగాణ విద్యుత్తు క్రయ విక్రయాలను నిలిపివేయడం సరికాదని ఆక్షేపించింది.
ఐఈఈ నిర్ణయం చట్ట వ్యతిరేకం
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గురువారం రాసిన లేఖ ఆధారంగా ఐఈఈ విద్యుత్తు కొనుగోలుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ టీజీఎస్పీడీసీఎల్ అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సాయంత్ర సమయంలో విచారణ చేపట్టిన హైకోర్టు ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 240 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం కాగా, 1.80 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నామని, మరో 60 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 60 మిలియన్ యూనిట్ల సరఫరాను అడ్డుకుంటే రోజువారీ ప్రజల అవసరాలకు విద్యుత్తు చాలదని, ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తంచేశారు.
పీజీసీఎల్‌కు చెందిన బకాయిల వివాదం సీఈఆర్సీలో పెండింగ్ ఉందని గుర్తుచేశారు. ఈ లోగానే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గురువారం ఇచ్చిన సమాచారంతో ప్రాప్తి పోర్టల్ నుంచి టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్తు క్రయవిక్రయాలను నిలిపివేసిందని ఆక్షేపించారు. విద్యుత్తు కొనుగోలుకు పవర్ ఎక్స్ఛేంజ్‌లు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. దీనివల్ల రాష్ట్రమంతా ప్రభావం పడుతుందని, గృహ విద్యుత్తు సరఫరాకు కూడా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది 60 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలుకు సమస్యగా మారుతుందని, వ్యవసాయ, పరిశ్రమలు, దవాఖానలు, గృహావసరాల విద్యుత్తు సరఫరాకు గడ్డు పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
విద్యుత్తు నిలుపుదల విషయం గురించి చివరి క్షణంలో లేఖ రాయడం చట్ట వ్యతిరేకమని వాదించారు. కేంద్ర సర్క్యులర్ ప్రకారం ఐదు రోజుల ముందుగానే విద్యుత్తు అవసరాలను ప్రాప్తి పోర్టల్ ద్వారా సమాచారం ఇవ్వాలనే నిబంధనను ఉల్లంఘించి లేఖ రాసినట్టు చెప్పారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లేఖ కారణంగా పీసీఈఎల్‌కు చెందిన ప్రాప్తి పోర్టల్ టీజీఎస్పీడీసీఎల్ ఇన్వాయిస్‌లను అప్లోడ్ చేయడానికి అనుమతి లేదని చెప్పారు. దీంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ తరపున డిప్యూటీ సాలిసిటర్ జనరల్ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రాసిన లేఖను సస్పెండ్ చేసింది. విద్యుత్ కొనుగోలుకు డిస్కంలకు అనుమతించాలని ఐఈఈఎల్‌కు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సెంట్రల్ ట్రాన్స్ మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్, కేంద్ర విద్యుత్తు శాఖలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ దసరా సెలవుల తర్వాత చేపడతామని ప్రకటించింది.
మెడకు చుట్టుకున్న పాత బకాయిలు
ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్తు సరఫరా కోసం 2015 సెప్టెంబర్ 22న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 12 ఏండ్ల కాలానికి బ్యాక్ టు బ్యాక్ లాంగ్ టర్మ్ పద్ధతిలో కుదిరిన ఒప్పందం. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తును రాష్ట్రానికి సరఫరా చేసేలా డిస్కంలు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌తో 2000 మెగావాట్ల సామర్థ్యంగల కారిడార్‌ను బుక్ చేసుకున్నాయి. ఇది 25 సంవత్సరాల పాటు విద్యుత్తు సరఫరాకు సంబంధించిన ఒప్పం దం. దీని ప్రకారం వెయ్యి మెగావాట్లు 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి.. మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్తు 2018 నవంబర్ నుంచి అందుబాటులోకి రావాలి.
అయితే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు సరఫరా అయ్యే అవకాశం లేకపోవడంతో డిస్కంలు అదనంగా తీసుకున్న 1000 మెగావాట్ల కారిడార్‌ను మినహాయించాలని పవర్ గ్రిడ్‌ను కోరాయి. కానీ పవర్‌గ్రిడ్ అంగీకరించలేదు. ఒప్పందం ప్రకారం విద్యుత్తు సరఫరా అయినా.. కాకపోయినా.. వాడినా.. వాడకున్నా రిలింక్విష్ మెంట్ ఛార్జీలుగా రూ.261 కోట్లు తమకు చెల్లించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో తెలంగాణ డిస్కంలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఆశ్రయించాయి. అక్కడ విచారణ కొనసాగుతోంది.
సీఎం ఆదేశంతో..
విద్యుత్తు కొనుగోలును అడ్డుకొన్న విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలక్కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. సీఎం సూచనతో డిస్కంలు, ట్రాన్స్‌కో అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణను డిఫాల్టర్‌గా ప్రకటించి, విద్యుత్తు కొనుగోళ్లను నిలిపివేయడం అన్యాయమని వాదించారు. బకాయిల చెల్లింపునకు సంబంధించి ప్రాప్తి పోర్టల్‌లో పవర్ గ్రిడ్ నమోదు చేసినా.. మరో 75 రోజులపాటు చెల్లింపులకు గడువు ఉంటుందని, అదేమీ పట్టించుకోకుండా కరెంట్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించడం సరైంది కాదని నివేదించారు. దీంతో విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.