నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : వరంగల్,- ఖమ్మం-, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటనల జారీకి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.
సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే చెల్లింపు వార్తలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యతిరేక, అనుకూల వార్తలను ఎంసీఎంసీ పర్యవేక్షించనుందని వెల్లడించారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలను అభ్యర్థులు కచ్చితంగా పాటించాలన్నారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఎంసీఎంసీ సభ్యులు కోటేశ్వర్‌రావు, శేషాచార్యులు, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ తదితరులున్నారు.