calender_icon.png 11 February, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాన్య ప్రజల అవసరాలకు తక్కువ ధరకే అనుమతి మంజూరు

10-02-2025 08:26:38 PM

జిల్లాలో సామాన్య ప్రజల సొంత అవసరాలకు అతి తక్కువ ధరకు మట్టి, మోరం తీసుకునేందుకు అనుమతి..

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): సామాన్య ప్రజలకు సొంత అవసరాల కోసం అవసరమైన మట్టి, మోరం తీసుకునేందుకు తహసీల్దారుల ద్వారా అతి తక్కువ ధరకు అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు సొంత ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మట్టి, మోరం సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. జిల్లాల్లో మట్టి, మోరం తీసుకునేందుకు ఒక ట్రాక్టర్ రూ.200 రూపాయలు, టిప్పర్ రూ.800 రూపాయల రుసుము తహసిల్దార్ లకు చెల్లించి అనుమతి పొందాలని కలెక్టర్ తెలిపారు. 

మట్టి, మోరం అవసరమైన వారు మండల తహసిల్దార్ కార్యాలయంలో మట్టి అవసరం, ట్రిప్పుల వివరాలు, వాహన వివరాలు, డ్రైవర్ లైసెన్స్ కాపీను జత చేస్తూ దరఖాస్తు చేసుకుని ట్రాక్టర్ రూ.200 రూపాయల, టిప్పర్ 800 రూపాయలు చొప్పున రుసుము చెల్లించిన 24 గంటల్లో అనుమతులు జారీ అవుతాయని, మట్టి తరలింపు స్థలం, తేదీ, సమయం, అనుమతించిన వాహనాలు వివరాలతో తహసిల్దార్ అనుమతులు జారీ చేస్తారని, తహసిల్దార్ జారీ చేసిన అనుమతి పత్రంతో సంబంధిత మండలంలో గుర్తించిన లోకల్ రిసోర్స్ వద్ద నుంచి మట్టి, మోరంను తీసుకుని వెళ్లాలని కలెక్టర్ తెలిపారు. 

మట్టి సొంత అవసరాలకు మాత్రమే వాడాలని, ఎక్కడా డంప్ లు సృష్టించడానికి వీలు లేదని, డంప్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని చూస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మట్టి  తరలించాలని, సాయంత్రం 5 తరువాత మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మట్టి తరలింపు కోసం వినియోగించే ట్రాక్టర్, టిప్పర్  ఓవర్ లోడ్  కావడానికి వీలు లేదని, డ్రైవర్ కు తప్పనిసరిగా లైసెన్సు ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికి వీలు లేదని, వాహనానికి తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అన్ని వైపులా అంటించాలని కలెక్టర్ అన్నారు. మండలాల్లో గుర్తించిన మట్టి లోకల్ రీసోర్స్ లలో సంబంధిత తహసిల్దార్లు ప్రత్యేకంగా సిబ్బంది కేటాయించి, ప్రతి రోజు తరలించే మట్టి వాహన వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని అన్నారు. ప్రతి నెలా మట్టి తరలింపు వివరాలతో నివేదికను సంబంధిత తహసిల్దార్లు అందించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.