నాకు మానవత్వం లేదనడం సరికాదు
- నేను ఎలాంటి ర్యాలీ తీయలేదు
- థియేటర్‌కు కొద్ది దూరంలో నా కారు ఆగిపోయింది
- తొక్కిసలాట విషయం నేను థియేటర్‌లో ఉన్నప్పుడు తెలియదు
- ఆ ఘటన గురించి మరుసటిరోజే తెలిసింది
- నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదు
- అనుమతిస్తే ఇప్పటికిప్పుడు బాలుడ్ని చూడడానికి వెళ్తా
- మీడియా సమావేశంలో సినీ నటుడు అల్లు అర్జున్
సినిమా ప్రతినిధి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ‘పోలీసుల అనుమతితోనే నేను సంధ్య థియేటర్ వద్దకు వెళ్లాను. అక్కడ తొక్కిసలాట జరిగిందనే విషయం నాకు మరుసటి రోజు ఉదయం తెలిసింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను ప్రయత్నించినప్పటికీ నాకు అనుమతి ఇవ్వలేదు. బాలున్ని చూసే ప్ర యత్నం చేయలేదనే మాటలు అవాస్తవం.
ఇప్పటికప్పుడు అనుమతిచ్చి నా బాలున్ని చూసేందుకు నేను ఆసుపత్రి కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు.
ఈ నేపథ్యంలో శనివారం అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. తన వ్యవహార శైలిపై వచ్చిన వార్తలను అల్లు అర్జున్ ఖండించారు. తన క్యారెక్టర్‌ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పుకొచ్చారు.
నేను ర్యాలీ తీయలేదు
‘నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. పోలీసుల అనుమతితోనే నేను థియేటర్ వద్దకు వెళ్లాను. నేను అక్కడ ర్యాలీ తీయలేదు. థియేటర్‌కు వెళ్తున్నప్పుడు కొద్దిదూరంలో నా కారు కొంతసేపు ఆగిపోయింది.. ముందుకు కదల్లేదు. చేయి చూపిస్తూ ముందుకు కదలండని పోలీసులు అంటేనే, నేను బయటకు వచ్చి చేతులు ఊపాను.
థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఏ పోలీసూ లోపలికి వచ్చి జరిగిన ఘటన గురించి చెప్పలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి థియేటర్ యాజమాన్యం వచ్చి, జనం ఎక్కువగా ఉన్నారని చెబితే బయటకు వచ్చేశాను’ అని అల్లు అర్జున్ తెలిపారు. ‘తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటిరోజు దాకా తెలియదు.
మహిళ చనిపోయిన విషయం తెలిసి కూడా థియేటర్ నుంచి వెళ్లిపోతానని ఎలా అనుకున్నారు? నాకూ పిల్లలు ఉన్నారు కదా. విషయం తెలిసిన తర్వాత బన్నీ వాసుకు ఫోన్ చేసి, ఆసుపత్రికి వెళ్లమని చెప్పాను. నేను కూడా బయలుదేరదామని సిద్ధమయ్యా. కానీ, నాపై కేసు నమోదు చేశారని వాసు చెప్పాడు. నా లీగల్ టీమ్ కూడా వద్దని వారించింది.
అందుకే నేను ఆసుపత్రికి వెళ్లలేదు. గతంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్ అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వైజాగ్ వెళ్లి పరామర్శించాను. అలాంటిది నా సొంత అభిమానులు చనిపోతే, వెళ్లి కలవనా? జరిగిన ఘటన విషయం తెలిసి షాక్‌లో ఉన్నా. అందుకే ఆలస్యంగా వీడియో పెట్టా. డబ్బులు అనేది ఇక్కడ విషయమే కాదు.
చాలా ఈవెంట్లు పెట్టాలని అనుకున్నాం. ఈ ఘటన తర్వాత అన్నింటినీ రద్దు చేశాం. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకొని, మా నాన్నను వెళ్లమని చెప్పాను. అదీ కుదరదని అన్నారు. కుదిరితే సుకుమార్‌ను వెళ్లమన్న. అదీ కాదన్నారు’ అని చెప్పారు.
అనుమతిస్తే ఇప్పటికిప్పుడు వెళ్తా..
‘నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని అందరూ ఆరోపిస్తున్నారు. నా క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను ప్రయత్నించినప్పటికీ అనుమతి ఇవ్వలేదు. బాలున్ని చూసే ప్రయ త్నం చేయలేదనే మాటలు అవాస్తవం.
ఇప్పటికిప్పుడు అనుమతి ఇచ్చినా బాలున్ని చూసేందుకు నేను ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి పెద్ద అమౌంట్ ఫిక్స్‌డ్ చేయాలని అనుకున్నాం. అవసరమైతే బాలుడికి ఫిజియో థెరపీ చేయించాలనుకున్నాం.
తెలుగువారు గర్వపడేలా సినిమా చేశానని అనుకుంటుంటే, మనల్ని మనం కిందకు లాక్కుంటున్నాం. నేను ఎవరినీ నిందించడానికి ఈ ప్రెస్‌మీట్ పెట్టలేదు. మా సినిమాకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించింది. అందుకు ధన్యవాదాలు.
కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు’ అని తెలిపారు. 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవాన్ని ఒక్క రాత్రిలో పోగొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపాలు లేవన్నారు. తనకు మానవత్వం లేదనడం సరికాదన్నారు.
మూడు తరాలుగా మేమేంటో తెలుసు: అల్లు అరవింద్
థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ ఇంట్లో.. పార్కులో ఓ మూలన కూర్చొని రోజుల తరబడి అదే ఆలోచనలో ఉన్నాడని అల్లు అరవింద్ అన్నారు. ఒక అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడని చెప్పారు. మూడు తరాలుగా మా కుటుంబం గురించి తెలుసు.
ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా? మీ కళ్లనుంచి తప్పించుకుని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే, బాధగా ఉందని అన్నారు. ప్రజలు ఆదరిస్తే పైకి వచ్చిన కుటుంబం తమదని, ఆ అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నామని చెప్పారు.