calender_icon.png 17 April, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

15-04-2025 12:05:44 AM

భూ భారతిపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి

మండలాల సదస్సుకు కలెక్టర్లు వెళ్లాలి

కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెచ్చిన భూ భారతి చట్టంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇందుకు ప్రతి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించాలని, కలెక్టర్లు ఆ సదస్సులకు హాజరై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. సదస్సులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరువుతారని తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెఆర్‌డీ)లో సోమవారం భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగు నీటి ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

భూ భారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాలకు పంపారని.. భూభారతి చట్టంలో రెవెన్యూ యంత్రాగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. భూ భారతి  పైలెట్ ప్రాజెక్టు సదస్సులను  నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని చెప్పారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సూచించారు.

ఆ కమిటీల పరిశీలన అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపాలని.. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖరారవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని సీఎం ఆదేశించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగొద్దన్నారు.

అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి కమిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వేసవికాలంలో ఎక్కడా కూడా తాగు నీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. తాగు నీటి సరఫరా విషయంలో నీటి పారుదల శాఖ, తాగు నీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు.