calender_icon.png 25 April, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూవివాదాలకు శాశ్వత పరిష్కారం

25-04-2025 01:30:35 AM

కలెక్టర్ నారాయణ రెడ్డి

చేవెళ్ల, ఏప్రిల్ 24:  ‘భూ భారతి’  చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని  కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.  గురువారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని స్టార్ ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై తహసీల్దార్ గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఈ చట్టం రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడంతో పాటు, భూమి రికార్డుల సవరణ, సర్వే, మ్యాపింగ్, మ్యూటేషన్ ప్రక్రియలను సులభతరం చేస్తుందని  వివరించారు. 23 సెక్షన్లు, 18 నిబంధనలతో రూపొందిన ఈ చట్టం ద్వారా భవిష్యత్లో ‘భూధార్’ వ్యవస్థ కింద సమగ్ర భూ వివరాలు నమోదు చేస్తామన్నారు. 

మ్యూటేషన్ ఫీజు ఎకరానికి రూ.2,500గా నిర్ణయించామని, సాదా బైనామాలు, వారసత్వ భూముల మ్యూటేషన్లు వేగవంతంగా అమలవుతాయని తెలిపారు.  రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, ఉచిత న్యాయ సాయంతో పాటు అక్రమ పట్టాలు రద్దు  చేయబడుతాయని వెల్లడించారు.  ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని,  భూభారతి చట్టంపై ఉన్న అనుమానాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఆర్డీవో చంద్రకళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టం విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి,  ఆర్డీ వో చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్మన్లు పీసరి సురేందర్ రెడ్డి,  పెంటయ్య గౌడ్, టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్, మాజీ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ముజాయిద్దీన్, ఎంపీడీవో సంధ్య, ఎంఏవో అనురాధ, ఎంపీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఈవో మల్లయ్య, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.