18-04-2025 12:22:00 AM
కలెక్టర్ గౌతం
మేడ్చల్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి వల్ల భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ గౌతం అన్నారు.గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం పై తహాసీల్దార్లు, జిల్లా రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ 1989 ఆర్‌ఓ ఆర్ చట్టం లోని అంశాలు భూభారతి లోని అంశాలు కొంత వరకు సిమిలర్ గా ఉన్నాయని, అంతే కాకుండా రెవెన్యూ అధికారులకు ధరణీలో లేని అధికారాలు భూభారతిలో ఉన్నాయన్నారు.ఈ అధికారాలతో రెవెన్యూ అధికారుల పై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రతిది ఆన్ లైన్ ద్వారా డిజిటల్ రికార్డులను నిర్వహించాలని కలెక్టరు అధికారులకు సూచించారు.
ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని, ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆధార్ తరహాలో భవిష్యతులో భూ మికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ’భూధార్’ తీసుకురాబోతుందని పేర్కొన్నారు.
ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడినదని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్ధమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు. ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణను శాస్త్రీయంగా చేస్తూనే, మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూములపై పట్టాలను రద్దు చేసే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించబడిందని,భూ భారతి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతే కాకుండా భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనను ఏర్పర్చుకోవాలని కలెక్టరు సూచించారు.
ఈ నెల 19 నుండి జిల్లాలో అవగాహాన సదస్సులు ఉంటాయని ఈ సదస్సుల ద్వారా భూభారతి చట్టం పై ప్రజలకు, రైతులకు పూర్తి అవగాహాన కల్పించాలని కలెక్టరు ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, ఆర్డిఓలు ఉపేందర్ రెడ్డి, శ్యాంప్రకాష్, డిప్యూటి కలెక్టరు వంశీ మోహన్, తహాసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.