calender_icon.png 19 January, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాశ్వత నివాసులు స్థానికులే

06-09-2024 05:00:00 AM

  • ప్రభుత్వ సవరణ నిబంధన ౩(ఎ) చట్టబద్ధమే
  • మెడికల్ అడ్మిషన్లల్లో హైకోర్టు కీలక తీర్పు 
  • స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం 

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వైద్య కళాశాల్లో ప్రవేశాలు పొందేందుకు స్థానికులకు అవకాశం కల్పించాలని, మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల్లో రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాలని హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. నిబంధనల సవరణ ప్రకారం ౪ ఏండ్లు వరసగా తెలంగా ణలో చదివి ఉండాలని, శాశ్వత నివాసం ఉండాలని పేర్కొంది. అర్హత పరీక్షలో తెలంగాణ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పింది.

తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారికి మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడమే సవరణ నిబంధన 3(ఏ) లక్ష్యమని పేర్కొంది. ఈ నిబంధన చట్టబద్ధంగానే ఉందని స్పష్టంచేసింది. తెలంగాణకు చెందిన వ్యక్తి అర్హత పరీక్షలో ఇక్కడ ఉత్తీర్ణత సాధించలేదన్న కారణంగా అడ్మిషన్ నిరాకరిస్తే.. ఆ నిబంధన ఉద్దేశం నెరవేరనట్టేనని వెల్లడించింది. తెలంగాణకు చెందిన వ్యక్తి రాష్ట్రం బయట ఉన్న విద్యాసంస్థలో అర్హత పరీక్ష రాశారనో, బయట నివాసం ఉన్నారనో ప్రవేశాలను తిరస్కరించడం సరికాదంది.

ఈ నిబంధన రూపొందించిన చట్టసభ కూడా అన్నింటినీ లోతుగా పరిశీలించాకే స్థానిక విద్యార్థులకు మేలు చేయాలన్న సంకల్పం చూడాలంది. స్థానికులకు అవకాశం కల్పించడం కోసమే నిబంధన తీసుకువచ్చిందని, ఈ దశలో నిబంధనను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్లకు తలుపులు తెరిచినట్లు అవుతుందని, వారంతా కూడా అర్హులవుతారంది. ఫలితంగా రాష్ట్రంలో నివాసం ఉన్న స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధన తెలంగాణాలో శాశ్వత నివాసం ఉన్నవారికి వర్తించదని పేర్కొంది.

అయితే స్థానికత నిర్ధారణకు మార్గదర్శకాలు లేనందున వాటిని రూపొందించడానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నట్టు పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ స్థానిక విద్యార్థులకు వాటిని ఆన్వయించి సీట్ల కేటాయింపు చేయాలని తీర్పు వెలువరించింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలు 2017కు సవరణ తీసుకువస్తూ 3(ఎ) నిబంధన చేర్చుతూ ప్రభుత్వం జూలై 9న జారీ చేసిన జీవో 33ను సవాలు చేస్తూ దాఖలైన 53 పిటిషన్లపై వాదనల తర్వాత చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ 71 పేజీల తీర్పు చెప్పింది. 

రద్దు చేస్తే తెలంగాణవాసులకు అన్యాయం

మెడికల్ అడ్మిషన్ల నిబంధనల్లో సవరణ నిబంధన 3(ఎ)ను రద్దు చేస్తే తెలంగాణవాసులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉన్నవారందరూ 85 శాతం స్థానిక కోటా కింద అడ్మిషన్లు పొందేందుకు వీలు ఏర్పడుతుందని హైకోర్టు స్పష్టంచేసింది. అందుకని సవరణ నిబంధనను రద్దుచేయడం లేదని వెల్లడించింది. ఈ నిబంధన కింద తెలంగాణాలో శాశ్వత నివాసం ఉన్నవారు స్థానిక కోటా కింద మెడికల్ అడ్మిషన్లు పొందడానికి అర్హులని తేల్చింది. ఒక విద్యార్థి తెలంగాణ శాశ్వత నివాసిగా ఎప్పుడు పరిగణించవచ్చన్న అంశంపై నిర్ణయించడానికి వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాక వాటిని పరిశీలించి ప్రతి విద్యార్థికి స్థానిక కోటా కింద అన్వయించి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం సీట్లను కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆలిండియా సర్వీసు ఉద్యోగుల పిల్లలకు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాల్సివుందని గుర్తుచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతిని తెలిపిందని తెలియజేసింది. కాబట్టి సవరణ నిబంధన చట్టబద్ధమే.. అని తీర్పు వెలువరించింది.

వీగిన పిటిషనర్ల వాదన

స్థానికత నిబంధనపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో 38 ఉందని, అర్హత పరీక్ష ఇంటర్మీడియట్ తోపాటు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన వల్ల శాశ్వత నివాసులకు అన్యాయం జరుగుతుందని అని పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు డీవీ సీతారాంమూర్తి, బీ మయూర్‌రెడ్డి ఇతరులు వాదించారు. హైకోర్టు తీర్పుతో ఈ వాదన వీగిపోయింది.

రాష్ట్ర వాదన ఆమోదం

రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని 95 సెక్షన్ ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకే అవకాశం ఉంది. ఈ మేరకు వెలువడిన జీవో 72ను హైకోర్టు, సుప్రీం కోర్టులు సమర్థించాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏండ్లు దాటినందున మెడికల్ అడ్మిషన్ల నిబంధనల్లో సవరణ చేయాల్సిందే. అందుకే 3(ఎ) నిబంధనను చట్టంలో చేర్చాల్సివచ్చింది అని రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదించారు. 

తెలంగాణ విద్యార్థి వేరే రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాయవచ్చు

వైద్య విద్య ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితులైన పిటిషనర్లు 85 శాతం స్థానిక కోటా కింద అర్హులే. అయితే విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితుడనే వ్యవహారంపై ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించలేదు.   ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్థి వివరాలను పరిశీలించి స్థానిక కోటా అమలుపై కాళోజీ వర్సిటీ నిర్ణయం తీసుకోవాలి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీస్ అడ్మిషన్ నిబంధనలు 2017లోని రూల్ 3(ఎ) చట్టబద్ధమే. ఈ మేరకు జూలై 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33 చట్టబద్ధమే.

తెలంగాణకు చెందిన విద్యార్థులకు మాత్రమే స్థానిక కోటా వర్తింపజే సేందుకే ఆ నిబంధనను ప్రభుత్వం తెచ్చింది. ఇది స్థానిక విద్యార్థుల హక్కును రక్షిస్తున్నది. రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు వైద్య విద్యను పొందిన తర్వాత రాష్ట్రంలోనే ఉంటారు కాబట్టి రాష్ట్ర నివాసితులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడటం నిబంధన మరో లక్ష్యం. వీటిని సమర్థించాలి. తెలంగాణకు చెందిన విద్యార్థులకు నష్టం చేకూరేలా ఉండకూడదు. తెలంగాణ విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిరాకరించడం సరికాదు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు కాళోజీ వర్సిటీ తెలంగాణ స్థానికత వ్యవహారంపై సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలి.. అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.