calender_icon.png 9 January, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలకడలిపై పవళింపు కాలం

15-07-2024 10:23:51 PM

రేపు ‘తొలి ఏకాదశి’

ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశితో పండుగలు మొదలవుతాయి. కాబట్టే, ఇది ‘తొలి ఏకాదశి’ అయింది. ‘శయన ఏకాదశి’, ‘హరిబోధిని’, ‘పేలాల పండుగ’ అని ప్రాంతాల్నిబట్టి ఈ పర్వదినాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. హైందవ సంప్రదాయంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అన్నిట్లోకీ ఈ ‘తొలి ఏకాదశి’కి విశిష్ట స్థానాన్ని కల్పించారు. పాలకడలిపై విష్ణుమూర్తి ఈనాటి నుంచి నాలుగు నెలలపాటు యోగనిద్రలోకి వెళతాడు. ఈ కాలాన్నే ‘చాతుర్మాస్య వ్రతం’గానూ పలువురు దీక్ష పూనుతారు. ఈ నాలుగు నెలలపాటు పాలు, పెరుగు, ఆకుకూరలు, ఎండు మిరపకాయలు, చింతపండు వంటివాటిని వారు తమ ఆహారంలో నిషేధిస్తారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని ‘గురు పౌర్ణమి’గా జరుపుకుంటాం. తెలుగు మాసాల్లో ఆషాఢమాసం నాలుగవది. పౌర్ణమి తిథినాడు చంద్రుడు పూర్వ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలకి దగ్గరగా వచ్చే మాసం. ఇంకో విధంగా చెప్పాలంటే విష్ణుమూర్తి  శయనించడానికి సన్నద్ధమయ్యే నెల. అంతేకాదు, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి, సూర్యుడు మిథున రాశినుంచి కర్కాటక రాశిలోకి పయనమయ్యే దక్షిణాయన విషువత్ పుణ్యకాలం మొదలవుతుంది.

బోనాల నుంచి గోరింటాకు వరకు!

గ్రామీణ ప్రాంతాల్లో ఈ మాసం చాలా ప్రత్యేకమైంది. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ‘బోనాలు’ సమర్పణ అన్నది తెలంగాణ ప్రజలకు అత్యంత భక్తి కార్యం. మహంకాళి అమ్మవారికి తయారు చేసిన భోజనాన్ని అలంకరించిన కుండల్లో పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పిస్తారు. వర్షాకాలంలో విజృంభించే క్రిమి కీటకాదుల నుండి తమని రక్షించ మని వేడుకుంటూ చేసే ఉత్సవమే ఈ బోనా లు. సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణం వైపుకి మూడు నెలల ప్రయాణం సాగించి సరిగ్గా మధ్యకి చేరుకుంటాడు. ఆ రోజు పగలు, రాత్రి కూడా సమానంగా ఉంటాయి. ఇది ఈ మా సంలోని మరొక ప్రత్యేకత. 

వర్షాలు మొదలవడంతో అసలే వ్యవసా య ఆధారితమైన దేశం కనుక నాట్లు వేయాలి. తొలకరి జల్లులు పడినప్పుడు ఏరువాక చేసుకోవడం కూడా మనకు తెలిసిన విషయమే. ఈ కారణంగానే, కొత్తల్లుడు, కొత్త కోడలు.. వాళ్ళ అత్తగార్లతో కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదనే ఆచారం పెట్టారు. మొలకలు వేసే సమయంలో యువకులు ఇంటి ధ్యాస పడితే పని సరిగా జరగదు. అందుకే, కొత్త అల్లుడు అత్తగారి ఇంటికి వెళ్లకుండా ఉండాలని, కోడలు అత్తవారింట ఉంటే, పొరపాటున గర్భం ధరిస్తే ప్రసవ సమ యం నిండు వేసవి కాలం అవుతుందని ఇలాం టి ఆచారం మన పెద్దలు పెట్టారు. ఈ కాలంలో వచ్చే చర్మవ్యాధుల నుంచి కాపాడడానికి ‘గోరింటాకు’ పెట్టుకునే ఆచారం వాడుకలో ఉంది. తొలి ఏకాదశి నాడు ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. వ్రతం లేని వారు కనీసం గోవులను పూజిస్తారు. 

‘ఏకాదశి’ ఎలా మొదలైంది?

‘ఏకాదశి అన్నది అసలు ఎలా మొదలైం ది?’ అనడానికి పౌరాణిక కథ చెబుతారు. కృతయుగంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు వరగర్వంతో విర్రవీగుతూ మునులను, రుషులను హింసిస్తూ ఉంటాడు. అతనితో శ్రీమహా విష్ణువు వెయ్యేళ్ళపాటు యుద్ధం చేసినా ఓట మి సంభవించదు. కార్య సంబం ధం ఉంటుంది కదా, బహుశా అందుకోసమే విష్ణుమూర్తి అలసి పోయాడేమో! అప్పుడు విష్ణు మూర్తి సేద తీరుతుండగా, ఒక కన్యక ఉద్భవించి ఆ రాక్షసుణ్ణి, అంతమొందించిందని అం టారు. ఇదంతా బ్రహ్మదేవుని వరం. ఆ కన్యకను ప్రశంసిస్తూ విష్ణువు వరం కోరుకోమని అన్నప్పుడు, తాను ‘విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని’ కోరుకుంది ఆమె. ఇలా, ఈ కన్యే ‘ఏకాదశి’ తిథిగా అందరితోనూ పూజలు అందుకుంటున్నదని అంటారు.

ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు పారాయణం, భగవద్గీత పఠనం వంటివి జరపాలి. రాత్రంతా జాగరణ చేసి ద్వాదశి ఘడి యల్లో ఉపవాస విరమణ చేయాలి. ‘కార్తీక పు రాణం’లో అంబరీషుని కథ, దూర్వాస ముహాముని కోపం, అంబరీషునికి ఆయన ఇచ్చిన శాపాన్ని విష్ణుమూర్తి తీసుకుని పది అవతారాలు ఎత్తడం.. ఈ కథంతా మనకు తెలి సిందే. ఏకాదశి పూజలలో పితృదేవతలను కూడా తలచుకోవడం ఉంది. అందుకే, దీనికి ‘పెద్దల పండుగ’ అని కూడా పేరు వచ్చింది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, పేలపిం డి తినడం ఆచారంగా ఏర్పరిచారు.

దీని వెనుకా ఒక రహ స్యం ఉంది. గ్రీష్మ ఋతువులో వేసవి తాపానికి తట్టుకుని నిలిచిన వారు, వర్షాకాలంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల, శరీర సమ తుల్యం కోసం పేలపిం డి వేడిని కలుగజేస్తుందని పెద్దలు అంటారు. పేలపిండి పితృ దేవతలకు ఇష్టమని మరో కారణమూ చెప్తారు. ‘జొన్న పేలాల పిండి’లో బెల్లం దంచి ప్రసాదంగా కూర్చి ఇండ్లు, ఆలయాల్లో నైవేద్యం గానూ పంచి పెడతారు. ‘భవిష్యోత్తర పురాణం’లో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించినట్లుగా ఉంది. రుక్మాంగదుడు, ఏకాదశి వ్రతం ఆచరించి రంభను కూడా తిరస్కరించి సద్గతిని పొందాడని మరొక కథ బహుళ ప్రచారంలో ఉంది. 

 కామిడి సతీష్ రెడ్డి