calender_icon.png 25 October, 2024 | 9:54 AM

వీరకళాభేరి పేరిణి

29-05-2024 12:05:00 AM

అది నాట్యం కాదు తాండవం... వీరశైవ తాండవం. తెలంగాణ గడ్డమీద పుట్టిన అరుదైన నాట్య రీతి. దక్షయజ్ఞం దండకం చదువుతూ శరభ శరభ అశ్శరభ శరభ అంటూ పరవళ్ళు తొక్కుతూ వీరభద్ర  రూపాలై చిందులు తొక్కే పేరిణి కళాకారులు వీరశైవ సాంప్రదాయానికి ప్రతీకలుగా కనిపిస్తారు.  మిగతా నాట్యాలలాగా పేరిణి కేవలం వినోద ప్రధానం కాదు. ఇది ఆవేశ నర్తనం క్రీ.శ. 1253 54 ప్రాంతాలలో కాకతీయ సేనానులలో ఒకరైన జాయపసేనాని రూపొందించిన  ఈ నృత్య శైలి ఈ నాటికీ ప్రజా కళగా, వీర శైవ సాంప్రదాయ నృత్యంగా కొనసాగుతూనే ఉంది. శరభశరభ అశ్శరభశరభ అంటూ మొదలై భూమి దద్దరిల్లే అడుగుల చప్పుడు గుండెల్లో అదురు పుట్టించే భేరీ నాదం నాట్యం చేస్తున్న వారి కళ్ళలో ఆవేశం రంగస్థలమా రణస్థలమా అర్థం కానంత ఉద్వేగం పుట్టించే నర్తనం... పేరిణి శివతాందవం.

ఇది కూచిపూడి, భరత నాట్యం లాంటి సుకుమార భావ ప్రకటన కాదు. చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రకంపణ సైనికుల్లో యుద్ధం చేయటానికి కావాల్సిన ఉత్సాహాన్ని నింపటానికి స్వయంగా నృత్యరత్నావళిని రచించాడు జాయప సేనాని. సంస్కృత భాషలో ఆంధ్రులు రచించిన ప్రపథమ నృత్య శాస్త్ర గ్రంథంకూడా ఇదే.  కాకతీయుల కాలంలో దైవారాధనా నృత్యాలు శైవసాంప్రదాయాన్ని అనుసరించి ఉండేవి, పశుపతి సంప్రదాయానికి అనువుగా ఉండేవి. పేరిణి తాండవం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని పౌరుషాన్ని, అతనిలోని పోరాట స్ఫూర్తినీ లోకానికి తెలియజేస్తూ ప్రదర్శించే నర్తనమే పేరిణి శివ తాండవం.

ఇది వీరులు చేసిన వీర నాట్యం.  భారతీయ నృత్య రీతుల్లో ఎక్కడా ఈ పేరిణి నృత్యం కనిపించదు. వీరశైవులు సంగీత నృత్యాలతో శివుని పూజించేవారు. మూల విరాట్టుకు ఎదురుగా వున్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి. అలాంటి నాట్య వేదికలు ఈ నాటికీ వరంగల్ కోటలోనూ, హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి ముఖమండపంలోనూ, పాలంపేట రామప్ప దేవాలయంలోనూ మరికొన్ని కాకతీయ కాలం నాటి శివాలయాల్లోనూ కనిపిస్తాయి. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ మళ్లీ పునఃసృష్టి చేశారు. ఎన్నో కళలకు ప్రాచుర్యం తగ్గుతున్న ఈ కాలంలోనూ పేరిణి నృత్యానికి మాత్రం ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ  ఉత్సాహవంతులైన యువతీయువకులు ఈ నృత్యాన్ని నేర్చుకుంటూ ప్రదర్శనలు  ఇస్తున్నారు. కళ ప్రజాకళగా మారినప్పుడు దానికి మరణం ఉండదు. పేరిణి ఎప్పటికీ వన్నెతగ్గని తెలంగాణ పురాతన కళా వైభవం.

గత ఎనిమిదేళ్లుగా పేరిణి నృత్యం నేర్చుకుంటున్నాను. ఏదో ఒక కళ అని కాకుండా పేరిణిని ఎంచుకోవటం ఎందు కంటే ఈ నృత్యం మనలో తెలియని ధైర్యాన్ని ఇస్తుంది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. నాన్న చిన్నప్పుడే పోయినా అమ్మ ప్రోత్సాహం వల్ల పేరిణి నేర్చుకో గలిగాను. ఏనాడూ ఊరు కూడా దాటలేనేమో అనుకున్న నేను ఎన్నో వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వగలిగాను. పేరిణి నాకొక ధైర్యం, నా లోలోపలి శక్తిని ఈ ప్రపంచంతో కలిపే ఒక బంధం. 

అభినయ, పేరిణి కళాకారిణి

నటరాజు ఇచ్చిన అనుగ్రహం

గత పదేళ్లుగా పేరిణి నృత్యంతో అనుబంధం కొనసాగుతోంది. నాట్యంలో పేరిణిని ఎంచుకోవటం నాకు ఒక గౌరవాన్ని, ప్రాచీన కళకి నేనూ వారసుడిని అనే సంతృప్తినీ ఇచ్చింది. మణిద్వీప ఆర్ట్స్ అకాడెమీ పేరుతో నేను నిర్వహిస్తున్న పేరిణి స్కూల్‌లో ఇరవైకి పైగా విధ్యార్థులు ఉన్నారు. వారంతా తమకు తాముగా ప్రదర్శణలు ఇవ్వగల స్థాయికి వచ్చారు. ఎప్పుడు ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చినా ఆ వేదిక చిన్నదా పెద్దదా అని చూడను. పేరిణిని ప్రజలముందు ప్రదర్శించే ఏ చిన్న అవకాశాన్నీ నేనూ నా స్టూడెంట్స్ వదులుకోము.

 -పేరిణి సందీప్, 

(పేరిణి కళాకారుడు, ఆచార్యుడు)