- ప్రభుత్వం అమలుచేసే పథకాలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లడం లేదు
- పార్టీకోసం కష్టపడిన వారికి పార్టీ, నామినేటెడ్ పదవులివ్వాలి
- 2025 సంవత్సరం.. పార్టీ సంస్థాగత సంవత్సరంగా మారాలి
- పీఏసీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
హైదరాబాద్, జనవరి 8 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావే శంలో పలు కీలక అంశాలపై చర్చించా రు. పార్టీ మరింత బలోపేతం, ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై పీఏసీలో సుదీర్ఘ చర్చ జరి గింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్ష తన బుధవారం గాంధీభవన్‌లో జరిగి న పీఏసీ సమావేశానికి ఏఐసీసీ ప్రధా న కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మం త్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజన రసింహ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, విశ్వనాథం, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీ వేణుగోపాలు పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధ్ది కార్య క్రమాలు క్షేత్రస్థాయిలోకి పోవడం లేదు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలుతో పాటు పార్టీ నేతలు మరింత కష్టపడాలి. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తున్నా.. కిందిస్థాయిలో వ్యతిరేక ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. మంత్రుల పనితీ రు అశించినంతగా లేదు.
ఇంకా ఫెర్ఫార్మెన్స్ పెంచుకోవాలి’ అని కేసీ వేణుగోపాల్ హిత వు పలికినట్లుగా సమాచారం. మంత్రులపైన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలపైన పార్టీ కార్యక ర్తలకు ఇంకా నమ్మకం కుదరడం లేదని కేసీ వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి నట్లుగా తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంకా పార్టీ బలోపేతం దృష్టి పెట్టలేదని, 2025 సంవత్సరం సంస్థాగత సంవత్సరంగా ఉండాలని సూచించారు.
గ్రామ, మండల, బ్లాక్, జిల్లా స్థాయి కమి టీలను త్వరగా పూర్తిచేసి సంస్థాగతంగా మరింత బలోపేతం కావాలని, అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అన్నట్లుగా తెలిసింది. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్, కార్పొరేషన్లు, డైరెక్టర్ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని సూచించారు.
మంత్రులు జిల్లా కేంద్రాల్లో ప్రజాదర్బార్‌లు నిర్వహించి.. ప్రజల సమస్య లను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చూడాలన్నారు. అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై 15 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి మంచి స్పందన : మహేష్‌కుమార్‌గౌడ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు కృషిచేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలుచేసేందుకు కృషి జరుగుతుందన్నారు.
ఆరు గ్యారంటీల అమలు లో రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. ప్రియాంక గాంధీపైన బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండి స్తూ నిరసనలు వ్యక్తం చేసినట్లు పీసీసీ చీఫ్ వివరించారు.
అంబేద్కర్ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అవమానకర మాటలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైందని, తెలంగాణలో అన్ని ప్రాంతాల లో ఉద్యమాలు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ర్టంలో రైతులకు రుణమాఫీ, రైతు భరో సా, క్వింటాకు రూ. 500 రూపాయలు బోనస్ లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పీఏసీ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ రావడం చాలా సంతోషమని ఆయన తెలిపారు.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పల్లెలు, పట్టణాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
జనవరి 26 నుంచి రైతు భరోసా ఎకరాకు రూ. 12 వేలు అందించబోతున్నామని, వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి ఇంధీరా ఆత్మీయ భరోసా పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.12వేలు, కొత్త రేషన్ కార్డ్‌లు ఇవ్వబోతున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో రూ.54వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని అందులో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు వివరించారు.
మొదటి ఏడాదిలోనే 55, 143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని చెప్పారు. రూ .500 లకు గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల ఉచి త విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు రూ. 4 వేల కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని సీఎం వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి అసెంబ్లీ సమావే శాల్లో సంతాపం తెలిపామన్నారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. మన్మోహన్ ప్రధాని గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు జరిగిందని, పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లుఓవర్‌కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు.
వర్గీకరణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి : సంపత్‌కుమార్
ఎస్సీ వర్గీకరణ అమలు ఆలస్యం కావడం వల్ల మాదిగల్లో అసంతృప్తి పెరుగుతోందని, త్వరగా నిర్ణయం తీసు కోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నట్లుగా సమాచారం. వర్గీక రణ అమలు చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదం ఉంద ని, గ్రామాల్లో అన్ని కులాల కంటే మాది గలు ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పారు.
సంపత్‌కుమార్ చేసిన వ్యాఖ్య లపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకూడా సమర్థించినట్లు తెలిసింది. వర్గీకరణపై ఏకసభ్య కమిటీ నివేదిక రాగానే ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పినట్లుగా సమాచారం. కొత్త, పాత నేతలను సమన్వయం చేసు కుని ముందుకు వెళ్లాలని, అప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంత రావు అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని, స్పోర్ట్స్ యూనివర్సిటీ వల్ల యువతకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. జనరల్ స్థానాల్లో ఎస్టీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ అన్నట్లుగా తెలిసింది.