- సమగ్ర సర్వే దేశానికే రోల్ మోడల్
- సర్వేతో ప్రభుత్వ పథకాలు కట్ కావు
- అపోహలు, అనుమానాలు అవసరం లేదు
- బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో
- సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం, మేయర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇప్పటికే 30 శాతం పూర్తయిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన ప్రణాళికలను రూపొందించడానికే ఈ సర్వే చేపడుతున్నామని, ఈ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా బంజారాహిల్స్ డివిజన్‌లోని ఎన్‌బీటీ నగర్‌లోని నాజర్ కుటుంబానికి చెందిన, మిథాలీనగ ర్‌లోని సురేష్ రెడ్డి కుటుంబానికి చెందిన వివరాలను మేయర్ గద్వాల విజయలక్ష్మీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సర్వేలో నమోదు చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి ఇండ్లకు స్టిక్కరింగ్ వేసి 9 నుంచి సర్వే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సర్వేలో 87 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారన్నారు. గ్రేటర్ పరిధిలో 4.44 లక్షలకు పైగా ఇండ్ల సర్వే పూర్తయినట్టు తెలిపారు. సర్వే పట్ల ప్రజలు అపోహలు , అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.
ప్రజలు ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. సర్వే ఫలితాలతో ఎవరిని ప్రభుత్వ పథకాలకు దూరం చేయమని స్పష్టం చేశారు. సర్వేచేపట్టాలని గతంలో ధర్నాలు, దీక్షలకు దిగిన వారంతా ప్రస్తుతం సైలెంట్ అయ్యారన్నారు. ప్రభు త్వం చేపడుతున్న ఈ సర్వేను అన్ని సామాజిక సంఘాలు స్వాగతిస్తున్నట్టు తెలిపారు. సర్వే ఫలితాలను సరైన పద్ధతిలో విశ్లేషించి ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
బ్యాంక్ అకౌంట్ వివరాలు అక్కర్లేదు
సర్వేలో బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదా? అనే విషయాలు చెబితే సరిపోతుందని, బ్యాంక్ అకౌంట్ చెప్పాల్సిన పని లేదని మంత్రి పొన్నం ప్రభా కర్ స్పష్టం చేశారు. సర్వేలో బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడుగుతున్నారని ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మంత్రిని అడుగగా సర్వేలో ఫారంలో బ్యాంక్ అకౌంట్ ఉందా.. లేదా అనేది మాత్రమే ఉందని తెలిపారు.
అకౌంట్ ఉంటే ఉందని, లేదంటే.. లేదని మాత్రమే చెప్పాలన్నారు. ఎలాంటి అనుమానాలున్నా.. జిల్లా కలెక్టర్, స్పెషల్ నోడల్ అధికారులతో తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ సర్వేకు ప్రజలు సిబ్బందికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా సహకరించాలన్నారు.
సర్వే గురించి సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఖైరతాబాద్ జోన్ నోడల్ అధికారి శరత్‌చంద్ర, సూపర్‌వైజర్ శివాజీ, ఎన్యూమరేటర్లు మానస, సంధ్య పాల్గొన్నారు.