calender_icon.png 4 January, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

28-12-2024 02:36:55 AM

* ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి

* ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి

* రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి  తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్ధికాభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నూకనమ్మ అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీల కోసం సామాజిక రక్షణ, భద్రతకు బీసీ యాక్ట్‌ను తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో విద్య, ఉద్యోగ రిజర్వేషన్‌లను బీసీ జనాభా ప్రకారం 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేలకోట్లు కేటాయించాలని, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్‌లను 20 నుంచి 40 శాతానికి పెంచాలని అన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షుడు వరప్రసాద్‌యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, మల్లేష్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.