calender_icon.png 9 February, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

09-02-2025 01:14:08 AM

* ఆ తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలి

* సర్వేను సరిచేయకపోతే ఊరుకునేది లేదు

* సీఎస్‌కు బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం వినతి

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాం తి): బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో  42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించిన సర్వేను సరిచేయాలన్నారు.

డెడికెటెడ్ కమిషన్ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించాలన్నారు. శనివారం శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో మాజీమంత్రులు శ్రీని వాస్ గౌడ్, గంగుల కమలాకర్ సహా ఇతర బీఆర్‌ఎస్ నేతలు సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఏడు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కులగణనలో బీసీల వివరాలు సరిగ్గా సేకరించక అన్యాయం చేస్తున్నాయన్నారు. దాని ఫలితంగానే నేటికీ బీసీలకు సమన్యాయం దక్కడంలేదని లేఖలో పేర్కొన్నారు. సీఎస్‌కు లేఖను అందించిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకులు సచివాలయం మీడి యా పాయింట్ వద్ద మాట్లాడారు. 

కాంగ్రెస్‌కు బీసీలపై చిత్తశుద్ధి లేదు..

కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి ఆరోపించారు. బీసీలకు ద్రోహం చేసే చర్యలను సహించేదిలేదన్నారు. కులగణన సర్వేను మళ్లీ చేయించాలన్నారు. సర్వే పేరుతో బీసీలను కాంగ్రెస్ దగా చేసిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.

కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ మర్చిపోయినా తాము మర్చిపోలేదన్నారు. రాష్ట్రంలో బీసీలను తొక్కే కుట్ర జరుగుతోందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఓటర్ లిస్ట్ కంటే సర్వేలో బీసీల సంఖ్య ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం 52 శాతం ఉన్న బీసీలు పదేళ్ల తర్వాత 46 శాతానికి ఎలా తగ్గారని ఎంపీ రవిచంద్ర నిలదీశారు.