జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే సంస్థలకు 100శాతం పెనాల్టీ విధిస్తామని.. ఎలాంటి పెనాల్టీ లేకుండా ఈనెలాఖరు కల్లా ట్రేడ్ లైసెన్స్ పొందాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిబంధనల మేరకు ప్రతి ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ కొత్త ట్రేడ్ లైసెన్స్ పొందడం, పాత లైసెన్స్‌లను తప్పనిసరిగా రెన్యూవల్ చేసుకోవాలన్నారు. ఈనెల 31 వరకూ ఎలాంటి పెనాల్టీ లేకుండా లైసెన్స్ పొందడం, రెన్యూవల్ చేసుకోవడం చేయాలన్నారు. లేనిపక్షంలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకూ 25 శాతం, ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా 50 శాతం జరిమానా వేయడం జరుగుతుందన్నారు.
అసలు లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసేవారికి 100 శాతం జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రూ.5వేల లోగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించేవారు తెలంగాణ గ్రీన్ ఫండ్ కింద అదనంగా రూ.500, రూ.5 వేలకు పైబడిన వారు రూ.1000 గ్రీన్ ఫండ్ చెల్లించాలన్నారు. ఇప్పటికే ట్రైడ్ లైసెన్స్ పొందనివారు, రెన్యూవల్ చేసుకోని వారు తక్షణమే మీసేవా, సీఎస్‌సీ కేంద్రాలతో పాటు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాలలో తమ ట్రేడ్ లెసెన్స్ పొందాలన్నారు. అలాగే www.ghmc.gov.in వెబ్‌సైట్ ద్వారా స్వయంగా ట్రేడ్ లైసెన్స్ పొందవచ్చన్నారు.