calender_icon.png 3 November, 2024 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100శాతం ఉత్తీర్ణతే టార్గెట్!

03-11-2024 01:06:19 AM

టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైనా ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కృషి చేస్తోంది. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగేలా ప్రణాళికలు రూపొం దిస్తోంది. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం ముందుకెళ్తోంది. ఇందుకు విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని భావిస్తోంది. కొన్ని జిల్లాల్లో డీఈవోలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

త్వరలో రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. ప్రతీ రోజు సాయంత్రం 4.15- 5.15 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  సోమవారం-తెలుగు, మంగళవారం-ఇంగ్లీష్, బుధవారం-మ్యాథ్స్, గురువారం-ఫిజిక్స్, బయోసైన్స్, శనివారం -హిందీ బోధించేలా టైం టేబుల్ నిర్ణయించారు.

ప్రభుత్వ పాఠశాలలు, జిల్లాపరిషత్, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్, కేజీబీవీల్లో దీన్ని పాటించా లని ఆదేశించారు. జనవరి నుంచి ఉదయంపూట కూడా ప్రత్యేక తరగలు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది మాత్రం నవంబర్ 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో మాత్రమే ప్రత్యేక తరగతులు ప్రారం భమయ్యాయి.

అల్పాహారంతో మరింత ప్రయోజనం

గత పదో తరగతి ఫలితాల్లో మోడల్ స్కూళ్లలో 95.06 శాతం, కేజీబీవీల్లో 93.06 శాతం, ఎయిడెడ్‌లో 88.61 శాతం, జిల్లా పరిషత్ బడుల్లో 86.03 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 80.18 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈసారి ఫలితాలను వంద శాతానికి తీసుకెళ్లేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఈ ఆలోచన బాగానే ఉన్నా విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ చదువుకునేందుకు వీలుగా స్పెషల్ క్లాసుల సమయంలో అల్పాహారం అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. లేకుంటే సాయంత్రం వేళలో ఖాళీ కడుపుతో విద్యార్థులు పాఠాలపై సరిగా దృష్టిని కేంద్రీకరించలేరు.

సాయంత్రం పొద్దుపోయే వరకు ఉండాలంటే విద్యార్థులు నిరసపడిపోవొచ్చు. కొన్ని చోట్ల మాత్రం డీఈవోలు, హెచ్‌ఎంలు ప్రత్యేక చొరవ తీసుకుని స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో అల్పాహారం పెట్టిస్తున్నారు.

స్పెషల్ క్లాసుల మార్గదర్శకాలు ఇలా...

* డిసెంబర్ 31లోపు మొత్తం సిలబస్ పూర్తి చేయాలి.

* టైం టేబుల్ ప్రకారం క్రమం తప్పకుండా స్పెషల్ క్లాసులు నిర్వహించాలి.

* ప్రత్యేక తరగతుల నిర్వహణను ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలి.

* స్పెషల్ క్లాసుల సమయంలో విద్యార్థులు బడి బయట ఉండకుండా చూసుకోవాలి.

* టీచర్లు బోధించేటప్పుడు చాక్ బోర్డును ఉపయోగించడం తప్పనిసరి.

* బోధనలో పునఃశ్చరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

* ప్రతి విద్యార్థి పట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

* విద్యార్థులకు హోమ్ వర్క్ ఇచ్చి, పర్యవేక్షించాలి.