calender_icon.png 27 November, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో 61శాతం చెరువులు కబ్జా

27-11-2024 12:09:30 AM

  1. అందుకే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది
  2. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
  3. పర్యాటకభవన్‌లో సీఎస్‌ఐఆర్ సదస్సుకు హాజరు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని దాదాపు 61శాతం చెరువులు కబ్జాకు గురయ్యాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. మంగళవారం బేగంపేటలోని పర్యాటక భవన్‌లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ -నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్) ఆధ్వర్యంలో ‘పట్టణ చెరువుల నిర్వహణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. తెలంగాణలో వేగంగా పట్టణీకరణ జరుగుతోందన్నారు. దేశంలో జరుగుతున్న పట్టణీకరణ కంటే తెలంగాణలో 12 శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 47 శాతం పట్టణీకరణ ఉందని.. 2050 నాటికి అది 75 శాతానికి చేరుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు.

ఈ తరుణంలో ప్రకృతి వనరులను కాపడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అందుకే రాష్ర్ట ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో హైడ్రాను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉన్న ఈవీడీఎం( ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) వింగ్‌ను హైడ్రాలో విలీనం చేసిందని పునరుద్ఘాటించారు.

చెరువుల రక్షణ, రహదారుల కబ్జాల నివారణే హైడ్రా లక్ష్యం

ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం, చెరువుల పరిరక్షణ, ప్రజావసరాలకు కేటాయించిన పార్కులను, రహదారులు కబ్జాలకు గురికాకుండా  కాపాడటం హైడ్రా ముఖ్య ఉద్దేశ్యమని రంగనాథ్ అన్నారు. పట్టణీకరణలో భాగంగా  నగరంలో ఇండ్ల స్థలాలకు డిమాండ్ పెరిగిందని, భూమికి విలువ పెరిగి కొన్నిచోట్ల చెరువులు కబ్జాకు గురయ్యాయని తెలిపారు.

నగరంలో ఇంకా మిగిలిన 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని లేదంటే మరో 15 ఏళ్లకు నగరంలో చెరువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతుంద న్నారు. నగరంలో చెరువులు ఎన్ని వున్నా యి, చెరువుల విస్తీర్ణం ఎంత అనే దానితోపాటు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించే పని హైడ్రా చేపట్టిందన్నారు.

నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ సర్వే విభాగం, విలేజ్ మ్యాప్స్ ఆధారంగా చెరువుల విస్తీర్ణాన్ని నిర్ధారించేపని చేస్తోందని స్పష్టం చేశారు. ఇటీవల ఇంజనీరింగ్, మైనర్ ఇరిగేషన్, పర్యావరణ వేత్తలు, చెరువుల పరిరక్షణకు పనిచేస్తున్న నిపుణులతో సదస్సు నిర్వహించామన్నారు.  

తక్కువ వర్షానికే ముంపు..

చెరువులు, పార్కులను కాపాడుకున్నప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యం అవుతుందని రంగనాథ్ స్పష్టం చేశారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ దెబ్బతినడం వల్లే నగరంలో 2 సెంటీ మీటర్ల వర్షం పడినా రహదారులు నీట మునుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే అనుమతులు లేని అక్రమ కట్టడాలను కొన్నిటిని హైడ్రా కూల్చివేసిందని స్పష్టంచేశారు.

హైడ్రా చర్యలవల్ల సామన్యులలో కూడా ఎఫ్ టీఎల్, బఫర్‌జోన్, చెరువు క్యాచ్మెంట్ ఏరియా అనే అంశాల పట్ల అవగాహన వచ్చిందని చెప్పారు. అర్బన్ లేక్ మేనేజ్మెంట్ పై ‘లేక్స్  పేరిట సీఎస్‌ఐఆర్ నిర్వహించిన మేధోమథనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో నాగపూర్ సీఎస్‌ఐఆర్‌ొోనీరి డైరెక్టర్ వైద్య, నీరి హైదరాబాద్ జోనల్ సెంట్రల్ చీఫ్ సైంటిస్ట్  బాషా పాల్గొన్నారు.