calender_icon.png 13 March, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలి

13-03-2025 12:09:20 AM

డీబీఎఫ్ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి మెట్ల శంకర్

సిద్దిపేట, మార్చి 12 (విజయక్రాంతి):  రాష్ట్ర బడ్జెట్లో విద్యకు15 శాతం నిధులు కేటాయించాల ని డిమాండ్ చేస్తూ దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో బుధవారం సిద్దిపేట  పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం కలెక్టరెట్ ఎఒ అబ్దుల్ రెహమాన్ కు వినతిపత్రం ఇచ్చారు. డిబిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. 24- 25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కేవలం 6.3 శాతం నిధులు కేటాయించి హామీని తుంగలో తొక్కిందన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనైనా ఎన్నికల హామీ ప్రకారం 15 శాతం నిధులు కేటాయించి మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కరువై విద్యార్థులు సమస్యల మధ్య చదువులు సాగిస్తున్నారని చెప్పారు .అసర్ నివేదిక ప్రకారం 5.4 శాతం పాఠశాలలో టాయిలెట్స్ లేవని 19 శాతం బడులు పాడుబడ్డాయన్నారు.

పాఠశాలలో 27శాతం  బాలికలకు మూత్రశాలల సౌకర్యం లేవని అసర్ నివేదిక స్పష్టంగా పేర్కొందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 11.95  శాతం పిల్లలు డ్రాప్ అవుట్ గా  మారి బడి బయట ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అంతర్జాతీయ మోడల్ స్కూల్ లను ప్రతి మండల కేంద్రంలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

గురుకులాలకు, సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, గురుకులాలలో ,సంక్షేమ వసతి గృహాలలో పౌష్టికాహారం అందించాలని కోరారు. ప్రభుత్వ విద్యాలయంలో నాణ్యమైన, సమాన విద్యను అందించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని కోరారు.

బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, రాష్ట్ర కార్యదర్శి ఎగొండ, జిల్లా ఉపాధ్యాక్షులు భీమ్ శేఖర్, పోతరాజు శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, బెజ్జెంకి తిరుపతి, దశరథం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.