- కేంద్ర బడ్జెట్ వందశాతం సంక్షేమ బడ్జెట్
- అన్నివర్గాలకు న్యాయం చేసేలా పద్దు
- రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోవాలని కోరుకోవడం లేదు..
- ఇప్పటికే సర్కార్‌పై వ్యతిరేకత ఉంది..
- నాలుగేళ్ల తర్వాత ప్రజలే కాంగ్రెస్‌ను పక్కన పెడతరు..
- మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ వందశాతం సంక్షేమ బడ్జెట్ అని, ఈ బడ్జెట్ ద్వారా 95 శాతం తెలంగాణ పథకాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శనివారం ఆయన ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై మీడియాతో మాట్లాడారు.
పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని, అన్నివర్గాలకు సమన్యాయం చేసే విధంగా బడ్జెట్‌కు రూపకల్పన జరిగిందని తెలిపారు. వ్యక్తిగత ఇన్‌కం టాక్స్ పరిధిని రూ.12 లక్షల వరకు పెంచడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
2014లో రూ.2 లక్షల పరిమితి ఉండగా, ఇప్పుడు రూ.12 లక్షల వరకు పెరిగిదంటే కేంద్ర ప్రభుత్వం వేతన జీవులపై ఎంత ప్రాధాన్యాన్నిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. బడ్జెట్ చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికి ఆపన్నహస్తం అందిస్తుందని తెలిపారు. తద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుందన్నారు.
బడ్జెట్‌తో 27 రంగాల్లో స్టార్టప్ రుణాలకు లైన్ క్లియర్ అయిందన్నారు. తెలంగాణ వాటా టాక్స్ డెవల్యూషన్ (రాష్ట్రాల వాటా పన్నులు) రూ.27 వేల కోట్ల నుంచి ఇప్పుడు రూ.30 వేల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. సహకార సమాఖ్యను మరింత బలోపేతం చేసేలా కేంద్రం రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు, 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలను అందిస్తోందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ వంటి నగరాలకు రూ.10 వేల కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ రానుందని వివరించారు. అమృత్ పథక నిధులను కేంద్రం రూ.6 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెంచిందన్నారు. తద్వారా తెలంగాణవ్యాప్తంగా 125కు పైగా అర్బన్ లోకల్ బాడీస్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు.
కేంద్రం వీధి వ్యాపారులకు రూ.30 వేల విలువైన క్రెడిట్ కార్డులు అందిస్తుందని, వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.5 లక్షల మంది లబ్ధిపొందుతారని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రపంచంలోనే పెద్ద మెడికల్ హబ్ గా రూపుదిద్దుకుంటోందని, ఈ తరుణంలో మెడికల్ టూరిజాన్ని కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికే వ్యతిరేకత కూడా మొదలైందన్నారు. నాలుగేళ్ల తర్వాత ప్రజలే కాంగ్రెస్‌ను పక్కన పెడతారని జోస్యం చెప్పారు.