calender_icon.png 9 November, 2024 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో 25 శాతం మందికి వెరికోస్ వెయిన్స్

09-11-2024 12:42:44 AM

  1. అందుబాటులో అత్యాధునిక చికిత్సా విధానాలు
  2. ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ సదస్సులో వైద్య నిపుణుల వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): దేశంలో దాదాపు 25 శాతం జనాభా వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారని, వీళ్లలో చాలామందికి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే నయం చేయొచ్చని జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని అందిపుచ్చుకొని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా చికిత్సలు చేయొచ్చని వివరించారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్ డిస్ట్రిక్ట్ 150 కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జాతీయస్థాయి ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రముఖ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ నిపుణుడు డాక్టర్ రాజా వీ కొప్పాల నేతృత్వం వహించారు.

దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 100 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు. బ్రెజిల్ నుంచి కొందరు నిపుణులు ఆన్‌లైన్‌లో హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ సమస్యను శస్త్రచికిత్స అవసరం లేకుండా లేజర్లు, ఇతర మార్గాల్లో నయం చేయడం ఎలాగన్న అంశంపై విస్తృతంగా చర్చించారు.

ఎనిమిదేళ్లుగా దాదాపు 40 వేలమందికి పైగా రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేశామని, ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ రాజా వీ కొప్పాల పేర్కొన్నారు. లేజర్ సహా ఈ రంగంలో ఉపయుక్తంగా ఉండే పలు పరికరాలను ఉత్పత్తి చేసే మెడ్‌ట్రానిక్ తదితర కంపెనీల ప్రతినిధులు కూడా హాజరై..

తమ పరికరాలు ఏయే విభాగాల్లో ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అంతర్జాతీయంగా పేరున్న వాస్క్యులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు డాక్టర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీమిరా, డాక్టర్ రాజేశ్ వాసు, డాక్టర్ ఫెర్రనాండో ట్రెస్ సిల్వెరియా పాల్గొన్నారు.