calender_icon.png 10 October, 2024 | 5:45 PM

రియల్ ఎస్టేట్ సంస్థాగత పెట్టుబడుల్లో 45 శాతం వృద్ధి: కొలియర్స్

03-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఈ ఏడాది జూలై త్రైమాసికంలో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 45 శాతం వృద్ధిచెంది 1.15 బిలియన్ డాలర్లకు చేరినట్టు రియల్టీ కన్సల్టెన్సీ కొలియర్స్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రీమియం గృహాలకు, కార్యాలయాలకు నెలకొన్న భారీ డిమాండ్‌తో సంస్థాగత పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయన్నది.

ఈ జూలై-సెప్టెంబర్‌లో 1,148.7 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు రియల్టీ రంగంలోకి తరలి వచ్చాయని, నిరుడు ఇదేకాలంలో 793.4 మిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయని కొలియర్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రంగంలో ఆఫీస్ విభాగం 616.3 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని ఆకర్షించిందని, గత ఏడాది ద్వితీయ త్రైమాసికంలో వచ్చిన 79.1 మిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా పెరిగినట్లు వివరించింది.

రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడులు 274.6 మిలియన్ డాలర్ల నుంచి 384.8 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు తెలిపింది. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ విభాగంలోకి పెట్టుబడులు 340.3 మిలియన్ డాలర్ల నుంచి 95.2 మిలియన్ డాలర్లకు తగ్గినట్లు వెల్లడించింది.