calender_icon.png 27 November, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

92 శాతం సమగ్ర సర్వే పూర్తి

27-11-2024 02:02:18 AM

  1. రాహుల్‌గాంధీ ఆలోచనతోనే సర్వే 
  2. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి 

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి) : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశంలో ప్రస్తుతం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే పోరాటం జరుగుతుందని చెప్పారు.

మహాత్మాగాంధీ పరివార్ రాజ్యాంగ రక్షణకు పూనుకుంటే.. మోదీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నదని మండిపడ్డారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

మొదటి ప్రధాని నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే.. రాజీవ్‌గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు, మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం పూర్తయిందన్నారు.

ఇప్పుడు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం  ప్రారంభమైందని పేర్కొన్నారు. కేంద్రం కూడా జనగణనతోపాటు కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. ‘జితని భాగిదారి.. ఉతని హిస్సేదారి’ అంటే ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అనే సూత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని తెలిపారు.

రాహుల్‌గాంధీ చేపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనుందునే మోదీ 400 ఎంపీ సీట్లు అడిగితే .. ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారని, అందుకు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలే నిదర్శనమని చెప్పారు.