న్యూఢిల్లీ, ఆక్టోబర్ 15: హ్యుందాయ్ మోటార్ జారీచేసిన రూ.27,850 కోట్ల మెగా ఐపీవోకు తొలిరోజున 18 శాతం స్పందన లభించింది. మంగళవారం ప్రారంభమైన ఐపీవోలో హ్యుందాయ్ 9,97,69,810 షేర్లను ఆఫర్ చేయగా, 1,77,89,457 షేర్లకు బిడ్స్ అందాయి. తొలి రోజున దాదాపు 0 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 26 శాతం సబ్‌స్క్రయబ్‌కాగా, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన షేర్లకు 13 శాతం సబ్‌స్క్రిప్షన్లు లభించాయి.
సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 5 శాతం సబ్‌స్క్రయిబ్ అయ్యింది.ఒక్కో షేరుకు రూ.1,865 చొప్పున (22 డాలర్లు) ప్రైస్‌బ్యాండ్‌గా జారీఅయిన ఈ ఇష్యూ 17న ముగుస్తుంది. హ్యుందాయ్ మోటార్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సోమవారం రూ. 8,315 కోట్లు సమీకరించింది. దేశంలో జారీ అయిన ఐపీవోల్లో ఇదే అతిపెద్దది.
రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూయే దేశంలో భారీ అయితే పెద్ద ఆఫర్‌గా ఇప్పటివరకూ గుర్తింపు ఉన్నది. అంతకు ముందు 2021లో పేటీఎం పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించింది. 2010లో వచ్చిన రూ.15,199 కోట్ల కోల్ ఇండియా ఐపీవో, 2008లో జారీ అయిన రిలయన్స్ పవర్ రూ. 11,563 కోట్ల ఆఫర్, 2017లో వచ్చిన రూ.11,176 కోట్ల జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవోలు భారీ ఆఫర్లుగా నమోదయ్యాయి.
హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన సబ్సిడరీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో 14.22 కోట్ల షేర్లను విక్రయిస్తుంది. ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ జారీచేయదు. భారత్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వచ్చి రెండు దశాబ్దాలు గడించింది. 2003వ సంవత్సరంలో మారుతి ఐపీవో తర్వాత ఆటోమొబైల్ ఐపీవో హ్యుందాయ్‌దే అవుతుంది.