calender_icon.png 24 November, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరో వేలుకు 7%!

27-08-2024 02:53:39 AM

ట్రాన్స్‌పోర్ట్ బిల్లులు రావాలన్నా కమీషన్..

ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించేందుకైనా..

మిల్లర్లకు  రైస్ మిల్లర్ల అసోసియేషన్ హుకుం

అసోసియేషన్ సంతకం లేని బిల్లులను పక్కన పెడుతున్న సివిల్ సప్లు శాఖ

మూడేండ్లలో.. ఆరు సీజన్లకు రూ. 600 కోట్ల రవాణా ఛార్జీల విడుదల

౭% అంటే.. 42 కోట్ల కమీషన్‌ను దిగమింగుడే?

కమీషన్‌లో.. సివిల్ సప్లు అధికారులకూ వాటా!

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ట్రాన్స్‌పోర్టు బిల్లులు మీకు రావాలంటే 7 శాతం కమీషన్‌గా ముందే నగదు ముట్టజెప్పాలి. చెప్పిన గడువులోగా బిల్లులు.. కమీషన్ తీసుకుని రండి. అంటూ.. రైస్ మిల్లర్ల అసోసియేషన్ హుకుం. అసోసియేషన్‌లో సభ్యులందరూ ఏడు శాతం కమీషన్‌ను ముందుగానే ముట్టచెప్పాలి.. లేకుంటే మీ బిల్లులకు మా బాధ్యత లేదంటూ తేల్చిచెప్పడం గమనార్హం.

ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్యన ఆరో వేలుగా అవతరించిన ఈ రైస్ మిల్లర్ల అసోసియేషన్ తాజా హుకుంతో మిల్లర్లు దడుసుకుంటున్నారు.  రైస్ మిల్లర్ల అసోసియేషన్ తమపై పెత్తనం చెలాయిస్తుందని మిల్లర్లు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు రైస్ మిల్లర్లకు మధ్యన ఆరో వేలుగా అవతరించిన రైస్ మిల్లర్ల అసోసియేషన్ తాజా తతంగం ఇది..!

రవాణా బాధ్యత..

ప్రతియేటా రెండు సీజన్ల (ఖరీఫ్, రబీ)లో ధాన్యాన్ని కొనుగోలు చేసి.. మిల్లర్ల వద్దకు ధాన్యాన్ని సివిల్ సప్లు శాఖ తరలిస్తుంది. తరువాత ఆ ధాన్యాన్ని మిల్లింగు చేసి బియ్యాన్ని సివిల్ సప్లు గోదాములకు రవాణా చేయాల్సిన బాధ్యత మిల్లర్లదే. అయితే రైస్ మిల్లు నుంచి సివిల్ సప్లు గోదాము 5 కి.మీ దూరంలో ఉంటే ఎలాంటి ట్రాన్స్‌పోర్ట్ (రవాణా) ఛార్జీలు చెల్లించరు. కానీ 5 కి.మీ దూరానికంటే ఎక్కువ ఉంటే.. కిలో మీటరుకు క్వింటాలుకు ఇంత మొత్తం అంటూ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను సివిల్ సప్లు శాఖ చెల్లిస్తుంది. ఇప్పుడు ఇక్కడే తాజా కమీషన్‌కు తెరలేచింది.

ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల విడుదల..

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం (సివిల్ సప్లు శాఖ) మిల్లర్లకు చెల్లించాల్సిన ఈ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను విడుదల చేసింది. 2019 నుంచి 2022 వరకు అంటే.. మూడేండ్ల పాటు (6 సీజన్లకు) ఈ రవాణా ఛార్జీల కింద మిల్లర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేసింది. ఆ మొత్తం సుమారు రూ. 600 కోట్ల వరకు ఉంటుంది. ఈ మూడు సంవత్సరాలకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు బిల్లు రావాలంటే వాస్తవానికి ప్రతి మిల్లరు తాము ఆయా సీజన్లలో రవాణా చేసిన బియ్యం, దూరం వగైరా సమాచారం, రసీదులతో బిల్లులను తయారుచేసి సివిల్ సప్లు శాఖ జిల్లా మేనేజర్ (డీఎం)కు అందించాలి. కానీ ఇక్కడ అలా కాకుండా.. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆ బాధ్యతను తీసుకుంటోంది.

ఉదాహరణ..

‘.. బోధన్ డివిజన్ రైస్ మిల్ సభ్యులకు తెలియజేయునది ఏమనగా.. ఖరీఫ్ అండ్ రబీ సీజన్ 2019 వరకు ట్రాన్స్‌పోర్ట్ బిల్స్‌ను తయారుచేసి టోటల్ అమౌంట్‌పై 7 శాతం అమౌంట్ తీసుకుని మన అసోసియేషన్‌కు రాగలరు. ఇట్టి వివరములు తేది 5.9.2024 వరకు తీసుకురాగలరు. అమౌంట్ తీసుకొని రానివారి బిల్లు పంపబడదు. బోధన్, రెంజల్, ఎడపల్లి, సాలూర, రుద్రూర్, కోటగిరి, వర్ని, మోస్రా, చందూర్ అన్ని మండలాల బిల్లులు, వాటితోపాటు 7 శాతం డబ్బులు తీసుకురాగలరు. లేనిచో బిల్లులు పంపబడవు. ఇక అసోసియేషన్ బాధ్యత వహించదు’ అంటూ తాజాగా  బోధన్ డివిజన్ రైసు మిల్లర్లకు అసోసియేషన్ నుంచి వచ్చిన మెస్సేజ్ ఇది. ఇదొక్కటే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తున్న కమీషన్ కథ ఇదే.

రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్..

2019 నుంచి 2022 వరకు ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు రూ.600 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో.. మిల్లర్ల అసోసియేషన్ జూలు విదిల్చింది. సివిల్ సప్లు శాఖ నుంచి ట్రాన్స్‌పోర్టు బిల్లులు రావాలంటే.. మిల్లర్లు వారికి రావాల్సిన బిల్లులు.. అందులో 7 శాతం నగదును గడువు లోపల అసోసియేషన్‌లో చెల్లించాలని, గడువు ముగిసిన తరువాత వచ్చే బిల్లుల సంగతి తమకు తెలియదంటూ హెచ్చరిస్తూ.. మిల్లర్లందరి సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారాన్ని పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే బోధన్ డివిజన్ అసోసియేషన్‌కూడా తమ పరిధిలోని మిల్లర్లకు గడువు తేదీని గుర్తుచేస్తూ.. 7 శాతం నగదును తీసుకుని రావాలంటూ హెచ్చరికలు జారీచేసింది.

ఆరోవేలు..

వాస్తవానికి సివిల్ సప్లు శాఖకు.. మిల్లర్‌కు మధ్యన నడిచే ధాన్యం,మిల్లింగు, గోదాములోకి తరలించడం వరకు ఎక్కడా అధికా రికంగా మిల్లర్ల అసోసియేషన్‌కు ప్రమేయం ఏమీ లేదు. కానీ, గడిచిన దశాబ్ద కాలంగా మిల్లర్లకు, సివిల్ సప్లు శాఖకు మధ్యలో మిల్లర్ల అసోసియేషన్ బలంగా వేళ్లూనుకుంది. రైస్ మిల్లింగు వ్యాపారంలోకి ప్రజాప్రతినిధులు రావడంతో రాజకీయ జోక్యం ఎక్కువైంది. వ్యాపారుల అవతారం ఎత్తిన ప్రజాప్రతినిధులు అసోసియేషన్లలో చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఇదే సమయం లో తామిచ్చిన ధాన్యాన్ని మిల్లింగు చేసి బియ్యాన్ని తిరిగి తమ గోదాములకు తరలించే ప్రక్రియలో రాజకీయ పలుకుబడి కారణంగా అసోసియేషన్‌ను భాగస్వామ్యం చేశారు.

అసోసియేషన్ నుంచి వచ్చే విజ్ఞప్తులను మాత్రమే సివిల్ సప్లు శాఖ పరిష్కరిం చేది. దీనితో మిల్లర్లుకూడా విధిలేని పరిస్థితుల్లో అసోసియేషన్ ద్వారానే ముందుకెళ్ళ డం అలవాటు చేసుకున్నారు. దీనితో సివిల్ సప్లు, రైస్ మిల్లర్ల మధ్యన ఎలాంటి అధికారం లేని రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆరో వేలుగా అవతరించింది. ఎలాంటి వ్యవహారాలనైనా అసోసియేషన్ ప్రతినిధులు చక్కబె ట్టుకు రావడంతో వారి ప్రాబల్యంకూడా పెరిగింది. సివిల్ సప్లు తరఫున తామే మిల్లర్లపై అజమాయిషీ చేయడం మొదలు పెట్టిం ది. అసోసియేషన్ (ఆ ముసుగులో కొందరు బడా వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు) ఏం చెప్పినా అదే వేదంలా అమలయ్యేది. ఇలా ఆరో వేలుగా అవతరించిన మిల్లర్ల అసోసియేషన్ అధికారేతర సంస్థగా మార్పు చెంది ఇటు సివిల్ సప్లు శాఖను అటు మిల్లర్లను ఆడించడం.. కొండొకచో భయపెట్టడంకూడా జరుగుతోంది.

కొరడా ఝుళిపించరా..

ఇదీ స్థూలంగా.. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల చెల్లింపులో అసోసియేషన్ పాత్ర తీరు. దీనికి సివిల్ సప్లు శాఖలోని అధికారులుకూడా తానా అంటే తందానా అని వంత పాడుతున్నారు. వారికికూడా ఈ కమిషన్లలో వాటా ఉండటమే కారణం. సివిల్ సప్లు, రైస్ మిల్లరు మధ్యన అసోసియేషన్ అజమాయిషీ ఎందుకు.. వారి సంతకం ఉంటేనే ఎలా చెల్లుతుందనే ఆలోచన సివిల్ సప్లు శాఖకు రాకపోవడం దురదృష్టకరం. ఇక ఈ ఆరో వేలును ఇలాగే కొనసాగిస్తారా.. లేక ఆరోవేలు అజామాయిషీని తొలగిస్తారా వేచి చూడాల్సిందే.

ఏడు శాతం కమీషన్..

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు రైస్ మిల్లర్లకు ట్రాన్స్‌పోర్ట్ చార్జీల కింద చెల్లించాల్సిన రూ.600 కోట్లు విడుదల చేసింది. దీనితో రంగంలోకి దిగిన ఆయా జిల్లాల రైస్ మిల్లర్ల అసోసియేషన్లు.. 7 శాతం కమీషన్ ఇవ్వాలం టూ హుకుం జారీచేశారు. తమ తమ పరిధిలో ఉన్న రైస్‌మిల్లర్లను బెదిరిస్తూ సమాచారం అందించడంతో రైస్ మిల్లర్లు ఇప్పుడు 7 శాతం కమీషన్‌ను పోగు చేసే పనిలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు చెలించేందుకు ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేయడం.. ఇందులో 7 శాతం అసోసియేషన్ డిమాండ్ చేయడం అంటే.. ఎంత లేదన్నా.. రూ. 42 కోట్ల  వరకు అసోసియేషన్లకు అందుతుందని మిల్లర్లే అంచనా వేస్తున్నారు.

అధికారులకూ వాటా..

ఇంత జరుగుతున్నా సివిల్ సప్లు శాఖ నిద్రపోతుందా అనే అనుమానం రాకమానదు. మీ అనుమానం నిజమే.. కాకపోతే నిద్రపోవడం లేదు.. నిద్ర పోయినట్టుగా నటిస్తోందన్నమాట. ఎం దుకంటే.. వాస్తవానికి ట్రాన్స్‌పోర్ట్ బిల్లు లు రావాల్సింది రైస్ మిల్లర్లకు.. ఇవ్వాల్సింది సివిల్ సప్లు శాఖ. బిల్లులను జిల్లా ల వారీగా జిల్లా మేనేజర్ (డీఎం) సివిల్ సప్లుకి మిల్లరు సమర్పించాలి. కానీ ఇలా నేరుగా బిల్లులు తీసుకొస్తే.. తీసుకోవడం అనే అనవాయితీ ఎన్నడో మూల కు పడేశారు. మిల్లర్ల అసోసియేషన్ సంతకం లేకుండా.. వచ్చే బిల్లులు చెల్లించరు. అసోసియేషన్ నుంచి వచ్చే బిల్లు లు మాత్రమే చెల్లిస్తారు.

దీనితో అసోసియేషన్ ఇంత శాతం.. అదికూడా ముందుగానే నగదు రూపంలో చెల్లించాలంటూ బెదిరిస్తోంది. ఇందులో సివిల్ సప్లు శాఖ అధికారులకుకూడా వాటా ఉంటుంది. అందుకే వారు అసోసియేషన్ ద్వారా వచ్చే బిల్లులు మాత్ర మే చెల్లిస్తూ.. కమీషన్ ఇవ్వకుండా నేరుగా డీఎం సివిల్ సప్లుకి దరకాస్తు చేసుకునేవారికి బిల్లులు చెల్లించకుండా కొర్రీలు పెడుతూ ఆఫీసు చుట్టూ తిప్పుకుంటారు. అందుకే మిల్లరుకూడా కమిషన్ పోతే పోనీ.. కనీసం ఛార్జీలన్నా వస్తాయి అనే ఆలోచనతో అసోసియేషన్ బాటపడుతున్నారు. అసోసియేషన్ పెద్దలు చెప్పినట్టుగా వింటున్నారు. మామూళ్ళు సమర్పించుకుంటున్నారు.