calender_icon.png 27 September, 2024 | 10:54 PM

మహిళలకు నెలకు రూ.2100

20-09-2024 01:28:58 AM

మాజీ అగ్నివీరులకు శాశ్వత ఉద్యోగాలు

హర్యానాలో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ 

చండీగఢ్, సెప్టెంబర్ 19: హర్యానాలో గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ పలు హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉపాధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, రైతులు, మహిళల సంక్షేమం తదితర అంశాలకు మేనిఫెస్టోలో చోటు కల్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సంకల్ప్ పత్ర పేరుతో గురువారం ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టంకడితే.. మాజీ అగ్నివీరులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

కనీస మద్దతు ధరతో 24 రకాల పంటల కొనుగోలు .. లాడో లక్ష్మీ యోజన కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థిక సాయం అందించనున్నారు. 10 పారిశ్రామిక నగరాలను నిర్మించి ఒక్కో నగరంలో 50 వేలమంది స్థానికులకు జాబ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు స్థానికులకు 2 లక్షల ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. చిరయు ఆయుష్మాన్ యోజన  కింద కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత వైద్యం, 70 ఏండ్లు పైబడినవారికి రూ.5లక్షల అదనపు కవరేజీ అందించనున్నారు.

హర్ ఘర్ గృహిణి యోజన ద్వారా రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కళాశాల విద్యను అభ్యసించే బాలికలకు అవల్ బాలికా యోజన స్కూటర్లను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇలా మొత్తం 20 హామీలతో మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, బీజేపీ స్టేట్ చీఫ్ మోహన్ లాల్ బడోలీ పాల్గొన్నారు. అక్టోబర్ 5న ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 8న ఓట్లను లెక్కిస్తారు.