02-04-2025 01:15:28 AM
ఉచిత సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 1 ( విజయ క్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు భువనగిరి పట్టణం, బీబీనగర్ మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు లేవని ఆ చరిత్ర సృష్టించింది, ఘనత సాధించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. పేదలకు ఆహార భద్రత కల్పించడానికి కాంగ్రెస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందన్నారు. సన్న బియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే అన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల తన పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేదని దొడ్డిబియ్యం మాత్రమే తినిపించి ప్రజల పొట్టను కొట్టారని తీవ్రంగా విమర్శించారు. ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులను తమ ప్రభుత్వం ఇవ్వబోతుందని ఇది ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం అని పేర్కొన్నారు. భువనగిరి సమ్మద్ చౌరస్తా వద్ద జరిగిన పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు ఆర్డీవో కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బీబీనగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఎమ్మార్వో ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.