దివ్యాంగుల ఉన్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది..
ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి.... కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల ఉన్నతి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, దివ్యాంగులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘా రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్ష్ సురభి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాజరయ్యారు. డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల ఉన్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి రూ.4 వేల పెన్షన్ అందుతుందని, త్వరలోనే పెన్షన్ సాయాన్ని రూ. 6 వేలకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. వనపర్తి జిల్లాలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ సమీపంలో 1000 చదరపు గజాలలో షెల్టర్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కలెక్టర్ ద్వారా అనుమతులు జారీ చేయించడం జరిగిందన్నారు. త్వరలోనే జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని, జిల్లాలో మెగా జాబ్ మేళా, రుణ మేళా నిర్వహించడం జరుగుతుందని వాటిని కూడా దివ్యాంగుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా దివ్యాంగులు వ్యాపారం పెట్టుకోవాలనుకుని, బ్యాంకు లోన్ కోసం ప్రయత్నించేవారు తమ దరఖాస్తులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెచ్చిస్తే సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులకు అన్ని విధాలా సాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. రెండు కాళ్లు లేకపోయినా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర వహించిన జైపాల్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇల్లు లబ్ది చేకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి.... కలెక్టర్ ఆదర్శ్ సురభి
అంగవైకల్యం శరీరానికే తప్ప మనసుకు కాదని, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరు దివ్యంగులను గౌరవించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 22 మంది దివ్యాంగులకు 80 శాతం సబ్సిడీతో లోన్లు ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే సంవత్సరం మరింత మందికి రుణాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి కలెక్టరేట్లో మూడు రోజుల పాటు అలింకో అనే సంస్థ ద్వారా ఉచితంగా దివ్యాంగుల ఉపకరణాలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇటీవల దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించగా, అందులో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేయడంతో పాటు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ లక్ష్మమ్మ, వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, డిఆర్డిఓ ఉమాదేవి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సంక్షేమ శాఖ సిబ్బంది అరుంధతి, రాంబాబు, భాస్కర్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.